19 April, 2026 | 5:46 AM

మంథనిలో కారు ఖాళీ!

09-05-2024 02:30 AM

చక్రం తిప్పుతున్న మంత్రి శ్రీధర్‌బాబు

కాంగ్రెస్‌లోకి చేరికల జోష్ 

గడ్డం వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా అడుగులు 

అయోమయంలో పాత క్యాడర్

మంథని, మే8 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో కారు స్పీడు తగ్గింది. వారం రోజులుగా ఇక్కడ మారుతున్న రాజకీయ సమీకరణలతో కారు ఖాళీ అవుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి గా పగ్గాలు చేబట్టిన మంత్రి శ్రీధర్‌బాబు.. గడ్డం వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. శ్రీధర్‌బాబు తనదైన శైలిలో ముందుకెళ్లడంతో నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఎన్నికలకు మరో నాలు గు రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆ పార్టీలో కనీసం ప్రచారాలకు కూడా కార్యకర్తలు కరువయ్యారని తెలుస్తోంది.  మూడు రోజులుగా నియోజకవర్గంలోని కమాన్‌పూర్, మంథని, ముత్తారం, మల్హర్ మండ లాల్లోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బుధవారం కమాన్‌పూర్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాగా, కాంగ్రెస్‌కే చెందిన ఓ ముఖ్య నాయకుడు శ్రీధర్‌బాబును కలిసి చేరికలను నిలిపివేసేందుకు ప్రయత్నం చేయగా, అందుకు మంత్రి ససేమిరా అన్నట్టు తెలిసింది.

చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో కమాన్‌పూర్‌లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమమైంది. వారంతా మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. అలాగే ముత్తారం, మంథని, రామగిరి మండలాల నుంచి కూడా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ పరిణామాలతో నియోజక వర్గంలో మొత్తం కారు ఖాళీ అవుతున్న ట్టు తెలుస్తోం ది. ఈ చేరికల పర్వం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా, నిన్నటి దాకా ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో పాత క్యాడర్ అయోమయంలో పడి నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని ఉన్న తమకు పార్టీ లో ప్రాధాన్యత తగ్గుతుందేమోనని అంతర్మథనంలో పడుతున్నారు. ఈ విషయమై పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదనీ, పాత క్యాడర్‌కు ఉండే ప్రాధాన్యత అలాగే ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు భరోసా ఇచ్చినట్టు తెలిసింది.

కాంగ్రెస్ పాలన మెచ్చే వలసలు : శ్రీధర్‌బాబు

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బుధవారం కమాన్‌పూర్‌లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. మాజీ ఎంపీపీ తనయుడు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఇనగంటి రామారావు, కమాన్‌పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఫీట్ల మంజుల భర్త ఫీట్ల గోపాల్,  కన్నాల సింగిల్ విండో మాజీ చైర్మన్ మల్క చంద్రకళ భర్త మల్కారావు స్వామి ఆధ్వర్యంలో 500 మంది కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ మంత్రి  పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, మాజీ ఎంపీపీలు కోలేటి మారుతి, మల్యాల రామచంద్రం గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.