వర్ణవివక్షను సహించం
కాంగ్రెస్ నేత పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
భారత్ విభిన్న జాతులను గౌరవించాలన్న ప్రధాని
ఈ విషయంలో మాట్లాడాలని రాహుల్‌కు సవాల్
దళితులు, ఆదివాసీలను రాష్ట్రపతిగా చేశామని వెల్లడి
నాపై ఎవరైనా విమర్శలు చేస్తే సహిస్తాను. కానీ, నా ప్రజలపై చేస్తే ఊరుకోను. శరీర రంగు ఆధారంగా ఓ వ్యక్తి ప్రతిభను మనం నిర్ణయిస్తామా? మనం ఏ రంగులో ఉన్నా అందరమూ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తాం. ఈ విషయంలో నాకు ఈ రోజు చాలా కోపంగా ఉంది. తలపై రాజ్యాంగాన్ని పెట్టుకుంటున్న కొందరు వర్ణం ఆధారంగా ప్రజలను అవమానిస్తున్నారు. రాకుమారా.. ప్రజలను ఇలా చూడాలని మీకు ఎవరు చెప్పారు?
వరంగల్, మే 8(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రవాసీ నేత సామ్ పిట్రోడా చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలపై స్పందిస్తూ చర్మం రంగు ఆధారంగా దేశ ప్రజలను అవమానకరంగా మాట్లాడటాన్ని ఖండించారు. వరంగల్ బహిరంగ సభలో బుధవారం మాట్లాడిన ఆయన.. పిట్రోడా వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘నాపై ఎవరైనా విమర్శలు చేస్తే నేను సహిస్తాను. కానీ, నా ప్రజలపై చేస్తే ఊరుకోను. శరీర రంగు ఆధారంగా ఓ వ్యక్తి ప్రతిభను మనం నిర్ణయిస్తామా? మనం ఏ రంగులో ఉన్నా అందరమూ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తాం.
ఈ విషయంలో నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది. తలపై రాజ్యాంగాన్ని పెట్టుకుంటున్న కొందరు వర్ణం ఆధారంగా ప్రజలను అవమానిస్తున్నారు. రాకుమారా.. ప్రజలను ఇలా చూడాలని మీకు ఎవరు చెప్పారు? దీనిపై రాకుమారుడు సమాధానం చెప్పాలి. ఇలాంటి జాత్యహంకార ధోరణిని మేము అంగీకరించం. 2014లో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశాం. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా నిలబడినప్పుడు ఇదే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఆమె ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నించింది. నాకు తెలిసి అమెరికాలో రాకుమారునికి ఓ గురువు ఉన్నారు. ఎలాగంటే క్రికెట్‌లో థర్డ్ అంపైర్ లాగా. ఆయన నుంచి ప్రతిసారీ మన రాకుమారుడు సలహాలు తీసుకుంటారు’ అని మోదీ మండిపడ్డారు.
నేను పూజించేది భద్రకాళీ అమ్మవారినే..
తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు జరుగుతోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మారాయన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను కాపాడు తోంది కాంగ్రెస్సేనని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పిడికిళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఉద్ఘాటించారు. అహ్మదాబాద్‌లో తాను కొలిచేది వరంగల్‌లో ఉన్న భద్రకాళీ అమ్మవారేనని చెప్పారు. భద్రకాళీ, రామప్ప దేవా లయాలు కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీకలుగా అభివర్ణించారు. నలభై ఏళ్ల క్రితం పార్టీని ప్రారంభించినప్పుడు బీజేపీకి వచ్చిన రెండు ఎంపీ సీట్లలో ఒకటి జంగారెడ్డి గెలిచిన హనుమకొండ అని గుర్తుచేశారు. అప్పటి నుంచే వరంగల్‌తో బీజేపీకి అనుబంధం ఏర్పడిందన్నారు. సురక్షిత భారత్‌ను బీజేపీ కోరుకుంటుందని, ఇండియా కూట మి ఏర్పడినట్లయితే సంవత్సరానికో ప్రధాని వస్తారని, ఇది దేశానికి పెను ప్రమాదమని హెచ్చరించారు.
తెలంగాణలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, ఓట్ల కోసం రుణమాఫీని ఆగస్టు 15కు వాయిదా వేయడం ఇందుకు నిదర్శమని తెలిపారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రె స్ చేతులెత్తేయడం ఖాయమని జోస్యం చెప్పారు. వేములవాడ రాజన్న మీద ఒట్లు వేస్తూ, హిందూ దేవాలయాలపై, సనాతన ధర్మంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతల ప్రభుత్వం అన్న మాట నిజమేనని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మారాయనడానికి జార్ఖండ్‌లో కాంగ్రె స్ పార్టీ నాయకుడి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలే ఉదాహరణ అని తెలిపారు.
రాజ్యాంగంలో అంబేడ్కర్ మతపరమైన రిజర్వేషన్లు దేశ అభివృద్ధికి ఆటంకం అని చెప్పిన విషయాన్ని మరిచిన కాంగ్రెస్.. కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్ అమలు చేయాలని చూసి న సందర్భంలో హైకోర్టు అడ్డుకోకపోతే హిందువులకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసినప్పటికీ ముందు కు సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోం దని ఆరోపించారు. అక్రమార్జనే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రజల నమ్మకం కోల్పోయిందని తెలిపారు.
దళితుడిని ముఖ్యమం త్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పా రన్నారు. దళితబంధు పథకం కూడా ఆ పార్టీ కార్యకర్తలకే మంజూరు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ను కాంగ్రె స్ కాపాడుతోందని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని, ఆ వాగ్దానాన్ని అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పసుపుబోర్డు ఏర్పా టు, వరి, పత్తికి మద్దతు ధరను చెల్లించడం, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అరూరి రమేశ్, ఆజ్మీరా సీతారాంనాయక్‌లను భారీ మెజారిటీతో గెలిపిం చాలని కోరారు.
నా యువ మిత్రుడిని కలిశా
ఎక్స్‌లో బాలుడి చిత్రాన్ని పోస్టు చేసిన మోదీ
వరంగల్, మే ౮ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా లక్ష్మీపురంలో బీజేపీ నిర్వహించిన జనసభకు హాజరైన ప్రధాని నరేంద్రమోదీ మామునూరు ఎయిర్‌పోర్టులో హెలిక్యాప్టర్ దిగి వాహనంలో సభాస్థలికి వెళుతున్న క్రమంలో ప్రధానిని చూసేందుకు దూబే ఉదయ్‌ప్రసాద్ దంపతులు తమ కుమారుడు జయాన్ష్‌ను ఎత్తుకుని ఇంటి ముందు నిలబడ్డారు. వారిని గమనించిన మోదీ వాహనం ఆపి ఆ బాలుడిని దగ్గరకు తీసుకున్నా రు. సరదాగా కాసేపు ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన మోదీ.. వరంగల్ పర్యటనలో ‘నా యువ మిత్రుడిని కలిశా’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






