30 July, 2026 | 5:59 PM

భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

30-07-2026 05:15 PM

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో వర్షాల ప్రభావం, గోదావరి నది, వాగులు, వంకల పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు, రహదారుల పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భవిష్యత్తులో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.