12-11-2025 12:11:40 PM
హైదరాబాద్: యువత.. సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ప్రసంగించారు. సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతోందని సూచించారు. ఉన్నతస్థానానికి చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడాలని శ్రీధర్ బాబు వెల్లడించారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తెచ్చామని పేర్కొన్నారు. అంకుర పరిశ్రమలు రూ. వంద కోట్ల టర్నోవర్ కు చేరుకోవాలన్నారు. స్టార్టప్ లకు సాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సూచించారు. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇతర దేశాల్లోని అవకాశాలు కోసం చూడొద్దని మంత్రి కోరారు. ఇతర దేశాలు మనపై ఆధారపడే స్థితికి మనం ఎదగాలని ఆయన సూచించారు.