16 June, 2026 | 1:19 PM

రుణమాఫీ చేసిన ప్రభుత్వంతోనే సవాళ్ళా?

18-08-2024 08:37 PM

హైదరాబాద్: గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా,  రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి, తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు పడ్తున్న పాట్లును చూసి జాలి వేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా రుణమాఫీ చెయ్యలేక రైతులతో నమ్మకం కోల్పోయన్నారు. ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోను ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచనే  చెయ్యని వారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంట లోపే 2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎటూ పాలుపోక కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్స్ నుండి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హత బట్టి రైతుల పంటల రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుతానిదని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. ఇప్పటికి కేవలం 2 లక్షల కుటుంబ నిర్దారణ జరిగిన ఖాతాదారులందరికి పథకాన్ని వర్తింప చేసాం. 2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. 2 లక్షల పైన ఉన్న ఖాతాలకు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముందు 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించిన పిమట్ట అర్హత బట్టి చెల్లిస్తాము. బ్యాంకర్లు నుండి వచ్చిన డేటాలో వివరాలు తప్పుగా ఉన్న రైతుల నుంచి కూడా  వివరాలును సేకరిస్తున్నాము. రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్స్ ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

అందరికి సమాచారం తెలియడం కోసం గత ప్రభుత్వ నిర్వకాలు ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రుణమాఫీ వివరాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో ఉన్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోని, ఇకనైనా హుందాగా ప్రవర్తించి, ప్రజల్లో తమ స్థాయిని కాపాడుకొంటారని ఆశిస్తున్నాని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 31000 కోట్లు నిధులు కేటాయించుకొని, గత ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితులోను, ఆగస్టు 15 లోపు 18000 కోట్లతో 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వంతో సవాళ్ళా? అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.