15 August, 2026 | 2:42 AM

గ్రీన్ మొబిలిటీకి తోడ్పాటు

15-08-2026 01:41 AM

ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం

నూతన టాటా సియెర్రా ఆవిష్కరణలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): తెలంగాణలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం చురుగ్గా ప్రోత్సహిస్తోందని అన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన టాటా సియెర్రా ఈవీని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్‌ను అభినందించిన ఆయన, భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, గౌరవనీయమైన బ్రాండ్లలో టాటా ఒకటని పేర్కొన్నారు. విశ్వసనీయత, ఆవిష్కరణలు, భద్రత, నాణ్యత విషయంలో టాటా సంస్థకు సుదీర్ఘమైన గుర్తింపు ఉందన్నారు. టాటా బ్రాండ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టాటా వాహనాల విశ్వసనీయత తనకు వ్యక్తిగతంగా తెలుసన్నారు.

‘నూతన సియెర్రా టాటా కుటుంబంలో మరో గర్వించదగిన వాహనం. భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇది గొప్ప విజయాన్ని సాధించాలి’ అని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం భారీ పరివర్తన దిశగా సాగుతోం దని, భవిష్యత్ రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్, సుస్థిర మొబిలిటీ కీలకపాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను విస్తరించడంలో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ వల్ల కాలుష్యం తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.

భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించేందుకు ఇది ఉపయో గపడుతుంది’ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంద న్నారు. ‘తెలంగాణను మరింత పచ్చదనం, పర్యావరణహితమైన, సుస్థిర భవిష్యత్ వైపు తీసుకెళ్లేందుకు ఆటోమొబైల్ పరిశ్రమతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ యాజమాన్యం, ఉద్యోగులు, జాస్పర్ టాటా ప్రతినిధులను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టాటా మోటార్స్ సీనియర్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సత్కరించారు.