07-05-2025 07:53:54 PM
హైదరాబాద్: కేంద్ర జల సంఘం ఛైర్మన్ తో బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) భేటి అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణ, కృష్ణా నదిపై టెలిమెట్రీల ఏర్పాటుకు ఆయన విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొలి విడతలో 45 టీఎంసీలు, సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. అలాగే పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
టెలిమెట్రీల ఏర్పాటుకు కావాల్సిన నిధులను కేఆర్ఎంబీకి ఇచ్చామని, ఎన్డీఎస్ఏ నివేదికలో మేడిగడ్డ నిర్మాణం, డిజైన్ లో లోపాలున్నాయని తెలిపారు. ఒక ప్రాంతంలో నిర్మిస్తామని డీపీఆర్ లో చెప్పి.. మరో చోట నిర్మాణం చేశారని ఆయన అన్నారు. సీడబ్ల్యూసీలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్డీఎస్ఏ నివేదికలో సూచించిందని మంత్రి పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని.. ప్రజాధనం వృథా కానివ్వమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.