15 April, 2026 | 2:59 AM

జిల్లాకు వరం పులిగుండాల ఎకో-టూరిజం

15-04-2026 12:09 AM

నేడు ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రులు భట్టి, పొంగులేటి

భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 

ఖమ్మం, ఏప్రిల్ 14(విజయక్రాంతి): పులిగుండాల ఏకో టూరిజం ఖమ్మం జిల్లాకు వరంగా మారే అవకాశం ఉంది.. ఖమ్మం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు జిల్లా ఖ్యాతిని పెంచే అవకాశం కనిపిస్తోంది.. ప్రకృతి అందాలు.. పక్షుల కిలకిళలు.. జలపాతాలు, దట్టమైన అడవులు, వన్యప్రాణులతో క్రియాటకుల కోసం పర్యావరణ అనుకూలమైన సాహసోపేతమైన కేంద్రంగా మారబోతుంది. ఇక్కడ పర్యటకుల  కోసం బోటింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.

అహ్లాదకరమైన వాతావారణం.. ఆనందాన్నిచ్చే అద్భుత, అకర్షణీయమైన బొమ్మలు.. ఎన్నో రకాలుగా తీర్చిదిద్దిని ఏకో టూరిజం స్పాట్ విక్షకులకు భలే పసందుగా మారనుంది.. ట్రెక్కింగ్ అభిరుచి గలవారికి, కుటుంబాలకు ఒక కొత్త ఆకర్షణీయ గమ్యస్థానంగా ఏకో టూరిజం నిలవనుంది. 40ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పులి గుండాల సరస్సు, జలపాతం, గుట్టపై ఉన్న పురాతన కాకతీయుల కాలంలో వీరభద్రస్వామి దేవాలయాలు, ఎంతో ఖర్చు చేసి నిర్మాణం చేసిన  ఈ ప్రాజెక్టు బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది.. ఇది ఖమ్మం నగరానికి కేవలం 60కిలో మీటర్ల దూరంలోనే అద్భుతమైన టూరిజం స్పాట్ ను తయారు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

తల్లాడ రేంజ్లోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పులిగుండాల ఎకో-టూరిజం ప్రాజెక్ట్ ను నిర్మాణం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మధ్య విస్తరించిన అటవీ ప్రాంతంలో, కల్లూరు, పెనుబల్లి మండలాలను ఆవరించి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ ప్రాజెక్ట్ బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో అభివృద్ధి చేయబడింది.

సహజ అటవీ వాతావరణంలో పర్యావరణహిత పర్యాటక అభివృద్ధిగా ఈ ప్రాజెక్టు నిలవనుంది.. ప్రజల భాగస్వామ్యంతో వన్యప్రాణి సంరక్షణ, జీవావరణ పరిరక్షణ, పక్షి వీక్షణ, ట్రెక్కింగ్, ప్రకృతి అనుభవ కార్యకలాపాల అభివృద్ధి, స్థానిక ప్రజలకు ఉపాధి, భాగస్వామ్య అవకాశాల సృష్టి లాంటి అనేక అంశాలతో కూడిన ప్రాజెక్టును ఖమ్మం జిల్లా అటవీశాఖ నిర్మాణం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం, సాంస్కృతిక సంపదను ప్రదర్శించడం జరుగుతుంది. 

అనేక  సౌకర్యాలతో ప్రాజెక్టు నిర్మాణం

పులిగుండాల ఏకో టూరిజం ప్రాజెక్ట్ పర్యటకులకు అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఖమ్మం జిల్లా అటవిశాఖ ఏర్పాటు చేసింది. పెడల్ బోటింగ్ సౌకర్యం, టెంట్ స్టే, తాత్కాలిక ఎకో-వసతి అనుభవం, అటవీ ప్రాంతంలో వన్యప్రాణి సఫారి అనుభవం, పక్షి వీక్షణ టవర్లు, వీయింగ్ పాయింట్లు, నక్షత్ర వీక్షణ, ప్రకృతి ఆధారిత వినోదం కోసం ప్రత్యేక ప్రదేశాలు, అలాగే ట్రక్కింగ్ మార్గాలు (అడ్వెంచర్, ఎకో-లెర్నింగ్ కోసం) అటవీశాఖ ఏర్పాటు చేసింది.  ఈ ప్రాజెక్ట్ను స్థానిక సమాజాల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. దీని ద్వారా పర్యాటక అభివృద్ధి స్థిరత్వం, సమగ్రత, పర్యావరణ విలువల ఆధారంగా కొనసాగుతుంది. 

సఫారి, అటవీ అనుభవం

సుమారు 27 కిలోమీటర్ల జంగిల్ సఫారి మార్గాన్ని పులిగుండాల ప్రాంతాన్ని పులిగుండం మినీ జలపాతం, చిరుత వీక్షణ టవర్ ప్రాంతంతో అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గం ద్వారా సందర్శకులు ప్రాంతీయ జీవ వైవిధ్యం, అటవీ సౌందర్యాన్ని సమీపంగా అనుభవించే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో భద్రతా ప్రమాణాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సఫారి నిర్వహణ ఉంటుంది. 

ప్రకృతి పర్యాటకానికి ఒక ఉత్తమ గమ్యం

అటవీ అందాలు, వన్యప్రాణులు, ట్రెక్కింగ్, పక్షి వీక్షణ, బోటింగ్, ప్రకృతి వసతులు ఇలాంటి ఆల్ ఇన్ వన్ అనుభవంతో పులిగుండాల ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ ఎకో-టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ కిన్నెరసాని, భద్రాచలం, సమీప దేవాలయ పర్యాటక కేంద్రాలతో కలిసి తెలంగాణ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించనుంది. అటవీ శాఖ ప్రకృతి ప్రేమి కులు, విద్యార్థులు, కుటుంబాలు మరియు బాధ్యతాయుత పర్యాటకులను పులిగుండాలకు ఆహ్వానిస్తోంది. సందర్శకులు పర్యావరణహిత నియమాలను పాటించి, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, ప్రకృతి పరిరక్షణకు సహకరించాలని కోరుతోంది.

ప్రాజెక్టును ప్రారంభించనున్న డిప్యూటి సీఎం, మంత్రులు

ఖమ్మం అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన పులిగుండాల ఎకో-టూరిజం ప్రాజెక్ట్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించనున్నారు. ప్రత్యేక వాహనంలో ఏకో టూరిజంను స్వయంగా మంత్రులు పరిశీలించనున్నారు. పర్యాట ప్రాంతాన్ని, ప్రాజెక్టు రూపకల్పను మంత్రులు పరిశీలించనున్నారు. అయితే మంత్రులు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.