28 August, 2026 | 6:42 AM

‘మిర్ ఆలం’.. టూరిస్టు స్పాట్!

28-08-2026 02:36 AM
  1. చెరువు చుట్టూ భారీగా సుందరీకరణ
  2. ఐలాండ్లకు సరికొత్త రూపు
  3. సస్పెన్షన్ బ్రిడ్జి, వాటర్ స్పోర్ట్స్‌తో మరింత ఆకర్షణ
  4. సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక సందర్శన
  5. అభివృద్ధి పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష 

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో చారిత్రక నేపథ్యం కలిగిన మిర్ ఆలం చెరువు(Mir Alam Tank) ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. వినోదం, ఆహ్లాదానికి కేరాఫ్‌గా మారబోతోంది. ఇందులో భాగంగా చేపట్టిన చెరువు పునరుజ్జీవనం, పరిసరాల సుందరీకరణతో పాటు ఐలాండ్ల అభివృద్ధి(Development of islands), ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జిల నిర్మాణ పనులు) ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాటర్ స్పోర్ట్స్ వంటి సదుపాయా లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గురువా రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మిర్ ఆలం చెరువును అకస్మికంగా సందర్శించి అభివృద్ధి పను లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫొటో ప్రదర్శన ద్వారా అధికారులు  పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. చెరువు నుంచి మూసీలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని స్పష్టం చేశారు.

చెరువు పునరుజ్జీవనంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాగా.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మిర్ ఆలం ట్యాంక్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. చెరువు పునరుజ్జీవనం, చెరువు పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.. ప్రధానంగా చేపడుతున్నారు.   

వాటర్ స్పోర్ట్స్‌కు డిజైన్

మిర్ ఆలం చెరువులో వాటర్ స్పోర్ట్స్(Water sports) నిర్వహించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిం చాలని సీఎం సూచించారు. అవసరమైన సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలిం చాలన్నారు. దీంతో యువతతోపాటు కుటుంబాలకు కూడా ఆకర్షణీయమైన వినోద కేం ద్రంగా మిర్ ఆలం మారుతుందని అభిప్రాయపడ్డారు. చెరువు చుట్టూ ఫుడ్‌కోర్టులు ,  పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, కుటుంబ వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద, కార్యకలాపాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. పాదచా రులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్లను తీర్చిదిద్దడంతో పాటు రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరచనున్నారన్నారు. మిర్ ఆలం చెరువులో ఉన్న ఐలాండ్లను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్(టెంట్లు వేయడం), ఇతర పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశాలను అధికారులను పరిశీలించాలని  చెప్పారు. వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసే  అంశంపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధిలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వెల్లడించారు.

జూ పార్కుతో అనుసంధానం

నెహ్రూ జూలాజికల్ పార్కుతో మిర్ ఆలం ట్యాంక్ అభివృద్ధిని అనుసంధానం చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. జూపార్క్ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంగా ఉండాలన్నారు. ట్యాంక్ పునరుజ్జీవనం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి డీపీఆర్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటుందన్నారు.

సస్పెన్షన్ బ్రిడ్జి పనుల్లో 50 శాతం పూర్తి

మిర్ ఆలం ట్యాక్‌పై  నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జి పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆగస్టు 27, 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 544 ఫైళ్లలో 273 పూర్తయ్యాయి. అంటే 50.18 శాతం పనులు పూర్తయ్యాయి. 62 పైల్ క్యాప్స్లో 28 పూర్తికాగా, 45.16 శాతం పురోగతి నమోదైంది. 62 పియర్- కమ్-పియర్ క్యాప్స్‌లో ఇప్పటివరకు ఆరు పూర్తయ్యాయి. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మిర్ ఆలం చెరువు ను పర్యాటకులను ఆకర్షించేలా..

పచ్చని పరిసరాలు, నెహ్రూ జూ పార్కు సమీపం, ఐలాండ్లు, వాటర్ స్పోర్ట్స, కుటుంబ వినోదం, ఫుడ్కోర్టులు, ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జితో  సరికొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సమగ్ర అభివృద్ధి పూర్తయితే హైదరాబాద్ నగరవాసులతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మిర్ ఆలం ట్యాంక్ మారనుంది. కుటుంబం మొత్తం ఒకేచోట రోజంతా ప్రకృతి, వినోదం, జలక్రీడలు, విశ్రాంతిని ఆస్వాదించేలా మిర్ ఆలం చెరువును తీర్చిదిద్దనున్నారు.