ధాన్యం నిల్వకు ‘సైలోలు’
- గోదాములకు బదులు ఆటోమేటెడ్ వ్యవస్థ
- ఒక్కోటి 5-10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం
- నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు
- డిఫాల్ట్ మిల్లర్లను వదలొద్దు
- సివిల్ సప్లు శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఏటేటా పెరుడుతున్న ధాన్యం దిగుబడికి(grain yield) అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి(N Uttam Kumar Reddy) తెలిపారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతతో(Modern technology) కూడిన సైలోలు(silos) నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదనంగా 5లక్షల నుంచి 10లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సైలోలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ కార్యకలాపాలపై గురువారం ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. రాష్ట్రంలో పెరుగుతున్న వరి సాగు, ధాన్యం ఉత్పత్తి, సేకరణకు(Paddy cultivation, grain production, procurement) అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ అవసరాలను సంప్రదాయ గోదాములతో తీర్చడం సాధ్యం కాదని, ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్, శాస్త్రీయ సంరక్షణ, యాంత్రిక రవాణా, డిజిటల్ పర్యవేక్షణ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో కూడిన నిల్వ నెట్‌వర్క్ అవసరమని మంత్రి తెలిపారు.
సైలోల్లో నిల్వ చేయడం వల్ల తేమ, పురుగులు, ఇతర కారణాలతో ధాన్యం నష్టపోకుండా ఉంటుందన్నారు. ధాన్యం నిల్వ నుంచి తరలింపు వరకు ప్రతి దశలో నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని పెంచే విధంగా సైలో వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామస్థాయి సంస్థలు, పౌర సరఫరాల సంస్థ భాగస్వామ్యంతో సైలోల నిర్మాణం, నిర్వహణకు అనువైన నమూనాలను అధ్యయనం చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఆర్థికంగా స్వయం సమర్థంగా, వృత్తిపరంగా నిర్వహించబడేలా తగిన ఆర్థిక, కార్యాచరణ నమూనాలను రూపొందించాలని, కొనుగోలు సీజన్‌కే పరిమితం కాకుండా రాబోయే దశాబ్దాల అవసరాలను ముందుగానే అంచనా వేసి నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో పౌర సరఫరాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, కేంద్ర గిడ్డంగుల సంస్థ, భారత ఆహార సంస్థ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రైవేటు పెట్టుబడిదారుల గోదాముల ద్వారా ధాన్యం నిల్వ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతంగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రతి సీజన్‌లో భారీగా సేకరిస్తున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇతర సంస్థలు, అద్దె గోదాములపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో పౌర సరఫరాల సంస్థ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించేందుకు సిద్ధమైందని, సీజన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తక్షణమే సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు.
సీఎంఆర్ బకాయిల వసూలు చేయాల్సిందే..
డిఫాల్టర్ మిల్లర్ల నుంచి సీఎంఆర్ బకాయిలను రాబట్టాల్సిందేనని మంత్రి ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. న్యాయపరమైన, విజిలెన్స్, పరిపాలనాపరమైన చర్యలన్నింటిలోనూ ప్రజాధనం తిరిగి రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.
ధాన్యం వేలంలో పూర్తి పారదర్శకత ఉండాలని, వేలం ప్రారంభించే ముందే లాట్ పరిమాణాలు, బిడ్డింగ్ నిబంధనలు, వేలం నిర్వహించే వేదికలను ఖరారు చేయాలని అధికారులను స్పష్టం చేశారు. జీఈఎం, తెలంగాణ ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా ధాన్యం వేలం వేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల అదనపు సంచాలకులు రోహిత్ సింగ్, పౌర సరఫరాల సంస్థకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.






