పంట మార్పిడితోనే రైతులకు లాభాలు
పంటల సాగు విధానాలు, వైవిధ్యతపై శిక్షణ కార్యక్రమంలో డీఏఓ
బెల్లంపల్లి, ఆగస్టు 14: ఒకే పంటను నిరంతరం సాగు చేయకుండా పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) ఎల్తూరి సురేఖ అన్నారు. శుక్ర వారం కాసిపేట మండలం ధర్మారావుపేటలో పత్తి ఉత్పాదక మిషన్ (కాపస్ కాంతి) 202627 కార్యక్రమంలో భాగంగా పంటల సాగు విధానాలపై, వైవిధ్యతపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీఏఓ మాట్లాడారు.
పంటల మార్పిడి, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా భూసారం పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. అలాగే పత్తిలో అంతర పంటగా కంది సాగు చేయడం వల్ల నేలలో నత్రజని స్థిరీకరణ జరిగి భూసారం మెరుగుపడుతుందని, చీడపీడలు, తెగుళ్ల ఉధృతి తగ్గుతుందని సూచించారు.
సమతుల్య ఎరువుల వినియోగం, నానో యూరియా, నానో డీఏపీ, సమగ్ర చీడపీడల యాజమాన్యం), నీటి యాజమాన్యం వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరించాలని, పత్తి ఆధారిత పంటల వ్యవస్థలు, అంతర పంటల ప్రయోజనాలు, భూసార పరిరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం, నేల ఆరోగ్య నిర్వహణ గురించి తెలియజేశారు.
పత్తి ఉత్పాదక మిషన్ పథకం కింద మండలంలో 680 ఎకరాలలో అధిక సాంద్రత పత్తి సాగు, క్లోజర్ స్పేసింగ్, సమగ్ర పత్తి యాజమాన్యం కింద 100 శాతం రాయితీ పత్తి పాకెట్స్ పంపిణీ చేయడం జరిగిందని, దానిలో భాగంగా పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను రైతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం కొండాపూర్ లో ఎరువుల దుకాణాలను డీఏఓ తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డులు, బిల్లులు, లైసెన్స్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజన్ ఏడీఏ రాజా నరేందర్, సర్పంచ్ జుగునాకర్ రాధ, మండల వ్యవసాయ అధికారి చల్లా ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోపు శ్రీనివాస్, ఏఈఓ నాగ దీప్తి, రైతులు పాల్గొన్నారు.






