శివ హత్య కేసులో ‘ఎంకే గ్యాంగ్’ కలకలం!
- పక్కా ప్లాన్‌తో నేతాజీ గ్రౌండ్‌కు పిలిచి దాడి
- గ్యాంగ్ లీడర్ సహా 23 మంది అరెస్ట్
- 9 బైకులు.. 20 సెల్‌ఫోన్లు స్వాధీనం
- పరారీలో మరో నలుగురు
- మణుగూరు డీఎస్పీ రవీంధర్‌రెడ్డి
మణుగూరు, ఆగస్టు 31,( విజయక్రాంతి): మణుగూరు నేతాజీ గ్రౌండ్లో జరిగిన సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిలో 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 9 బైకులు, 20 సెల్ఫోన్లు, ఒక కర్ర, ఒక చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ వివరాలు వెల్లడించారు. మృతుడు శివ గత కొంతకాలంగా హైదరాబాద్లో ఇంటీరియర్ పనులు చేసుకుంటూ ఉంటున్నాడు. అతని వద్ద పనిచేస్తున్న సతీష్కు, మణుగూరుకు చెందిన ఈర్ల లోకేష్కు గతంలో గొడవలు జరిగాయని, ఈ క్రమంలో సతీష్కు శివ మద్దతుగా నిలిచాడని, దీంతో లోకేష్ శివపై కక్ష పెంచుకున్నాడని తెలిపారు.
ఈ విషయాన్ని లోకేష్ ‘ఎంకే గ్యాంగ్’ నాయకుడిగా పోలీసులు పేర్కొన్న జెట్పట్ రమ్యాకాంత్ అలియాస్ రమ్మీ అలియాస్ జెట్టికి చెప్పినట్లు, అనంతరం జెట్టి.. శివను పలుమార్లు ఫోన్లో బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ఆగస్టు 26న శివ, సతీష్ తదితరులు హైదరాబాద్లో ఇంటీరియర్ పనిలో ఉండగా జెట్టి సతీష్కు ఫోన్ చేసి రాఖీ పండుగకు మణుగూరుకు వస్తే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు.
ఆ సమయంలో శివ ఫోన్ తీసుకుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని ప్రశ్నించడంతో జెట్టి అతడిని దూషించినట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం శివకు జెట్టి ఫోన్ చేసి మణుగూరుకు రావాలని, ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బతకాలని బెదిరించినట్లు, ఆగస్టు 27 ఉదయం హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చిన శివ.. తన స్నేహితుడు ఉదయ్కిరణ్ను వెంట తీసుకుని బ్పై నేతాజీ గ్రౌండ్కు వెళ్లినట్లు, అప్పటికే అక్కడ జెట్టి సహా పలువురు ఉన్నారని,
మాట్లాడుకుందామని పిలిపించి శివపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు విచారణ లో తెలిసిందన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ మృతిచెందాడని,. శివతో పాటు గ్రౌండ్కు వెళ్లిన ఉదయ్కిర్ప కూడా దాడి చేసి హత్యాయత్నం చేయగా.. అతడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు డిఎస్పీ తెలిపారు. దాడి ఘటన అనంతరం నిందితులు బైకులపై మణుగూరు రేగులగండి అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ బైకులను దాచిపెట్టి పరారైనట్లు,
నమ్మదగిన సమాచారంతో సోమవారం రేగులగండి అటవీ ప్రాంతంలో 23 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా జెట్పట్ రమ్యాకాంత్ గత రెండేళ్లుగా ‘ఎంకే (మణుగూరు ఖాన్ దాన్)’ పేరుతో ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడని, మణుగూరుకు చెందిన పలువురిని సభ్యులుగా చేర్చుకుని ఈ గ్యాంగ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్యాంగ్ సభ్యులు పరస్పరం సంప్రదింపుల కోసం ౠటీం ఎంకె’ పేరుతో వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
23 మంది అరెస్ట్.. నలుగురు పరారీ:
ఈ కేసులో అరెస్ట్ చేసిన వారిలో జెట్పట్ రమ్యాకాంత్ అలియాస్ రమ్మీ అలియాస్ జెట్టి, కందుల దినేష్, చెన్నబోయిన భరత్ , తోలేం జంపయ్య అలియాస్ పండు, రాయల వినయ్, మహమ్మద్ సాధిక్, నెట్టెం వరప్రసాద్, గనిబోయిన సాత్విక్ అలియాస్ చింటూ, గుగులోత్ రమేష్ అలియాస్ గోబి, కాండ్రు గణేష్, నక్క రాజా అలియాస్ విక్కీ, కంగాల సాయి జగన్ అలియాస్ జగన్, ఎదలపల్లి నాగేంద్రబాబు అలియాస్ కన్ని,
కొమెర చంటి, ఏనిక దినేష్, పున్నం వంశీ శివ అలియాస్ శివ, కొమరం హరీష్ అలియాస్ డాన్, ఇర్ప శ్రావణ్, కలబోయిన మల్లేష్, దేవుళ్ల దుర్గా ప్రసాద్, అక్కిరెడ్డి అభినయ్ రెడ్డి అలియాస్ అభి, సోయం నరసింహారావు అలియాస్ రేకుల్, ఈర్ల లోకేశ్వర్ అలియాస్ లోకేష్ ఉన్నట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
అరెస్ట్ చేసిన వారిలో జెట్పట్ రమ్యాకాంత్, గుగులోత్ రమేష్ పై గతంలో పేకాట కేసులు నమోదైనట్లు, చెన్నబోయిన భరత్, కందుల దిన్పే రెండేసి కొట్లాట కేసులు, గనిబోయిన సాత్విక్ అలియాస్ చింటూపై డెకాయిటీ కేసు గతంలో మణుగూరు పోలీస్స్టేషన్లో నమోదైనట్లు డిఎస్పీ తెలిపారు. అయితే అరెస్ట్ చేసిన వారిలో ఎవరికీ గంజాయి తాగడం, విక్రయించడం లేదా గంజాయి వ్యాపారంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
మణుగూరులో ఎవరైనా ఏ పేరుతోనైనా గ్యాంగులు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి గ్రూపులు లేదా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మణుగూరు సిఐ పాటి నాగబాబు, ఎస్త్స్రలు సీహెచ్ నగేష్, రావూఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






