ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలి
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, మే 24: చిట్యాల మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం చిట్యాల మండలం లోని ఉరుమడ్ల, పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి, సుంకేనపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం, నిల్వ, లారీల రవాణా, హమాలీల అందుబాటు, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం పరిమాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతులు ధాన్యం విక్రయానికి కేంద్రాలకు వచ్చిన తర్వాత ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ముఖ్యంగా ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతోందన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు ఉన్న కైలాష్ నేత,జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, తాసిల్దార్ విజయ్ కుమార్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






