అరెస్టు చేసిన వారిని తక్షణం వదిలేయాలి : హరిశ్ రావు
హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి బెల్లంపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరిశ్ రావు దీపై స్పందించారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కారించాల్సింది పోయి.
పరామర్శించేందుకు వచ్చిన వారిని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పరామర్శించేందుకు వెళ్లిన వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికం అని, ఇదేనా మీ ప్రజా పాలన? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హామీలతో రెచ్చగొట్టిన నాయకులకు ఇప్పుడు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే వదిలిపెట్టాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హరిశ్ రావు తెలిపారు.






