అనుమానించడం కాదు.. తగిన ఆధారాలు చూపాలి : హైకోర్టు
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ నిర్మాణంపై దర్యాప్తునకు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ తదుపరి విచారణపై స్టే విధించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనడానికి ఆధారాల్లేవని తెలంగాణ హైకోర్టు తెలిపింది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని, మీడియా సమావేశం పెట్టారనే పక్షపాత ధోరణితో వ్యవహరించారంటున్నారని హైకోర్టు పేర్కొంది.
అనుమానించడం కాదు.. తగిన ఆధారాలు చూపించాలని కేసీఆర్ తరుపు న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ నరసింహారెడ్డిపై ఆరోపణల నిరూపణలో కేసీఆర్ విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్ కు పంపించిన నోటీసుల్లో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల గురించి తెలుసుకోవడానికే పంపారు. కమిషన్ ఛైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని పేర్కొంది. అన్నీ పరిశీలించిన తర్వాత పిటిషన్ కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.






