03-05-2025 08:36:26 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఇటిక్యాల పెద్ద చెరువులో మట్టి తవ్వకాల పేరుతో కొందరు ఇరిగేషన్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వానికి సీనరేజ్ టాక్స్ పేరిట నామమాత్రపు చలాన్ లు కట్టి కొందరు మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ ఏంఎల్ నాయకులు, చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మత్స్యకారులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మట్టి తవ్వకాలకు అనుమతులు ఉంటే గత నెల 27 నుంచే తవ్వకాలు మొదలుపెట్టినట్లు ఆరోపించారు. చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లను నిర్ధారించకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మిలాకత్ అయి చెరువును చెరపడుతున్నారని మండిపడ్డారు.
చెరువు మట్టితో కెనాల్ పూడ్చివేత
గంపలపల్లి నుంచి వచ్చే ఇరిగేషన్ కెనాల్ ను ఇటిక్యాల చెరువులోని నల్లమట్టితో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పథకం ప్రకారం పూడ్చివేస్తున్నారు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం, కెనాల్ ను పూడ్చివేయడం లేదా ధ్వంసం చేయడం విరుద్ధం కానీ ఇదే చెరువులో తీసిన మట్టిని గొలుసుకట్టు విధానం ద్వారా గంపలపల్లి చెరువు నుంచి చేరే వరద నీటిని అడ్డుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు స్కెచ్ వేశారు. ఇప్పటికే కొంత భాగం కెనాల్ ను చెరువు మట్టితో పూడ్చివేశారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల లంచాలకు మరిగి ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లను గుర్తించడం లేదని నాయకులు ఆరోపించారు. మట్టి మాఫియా రాత్రి, పగలు తేడా లేకుండా టిప్పర్ లతో మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. ఇటుక బట్టిలకు మట్టి పేరుతో చెరువు లోని మట్టిని తవ్వి అదే చెరువుకు నీరు వచ్చే ప్రధాన కెనాల్ ను మూసివేసే పనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిమగ్నమయ్యారు.
ఇటిక్యాల చెరువులో మట్టి తవ్వకాలు చేస్తూ ఇటుక బట్టీలకు తరలించకుండ వేరే ప్రాంతాలకు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సీపీఐ ఏంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్, మండల కార్యదర్శి దొండ ప్రభాకర్, చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కన్వీనర్ సప్ప రవి, మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మాఫియా ప్రోద్భలంతో చెరువు హద్దులు మాయమయ్యేలా మొరం, మట్టితో చెరువును నింపివేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును చెరువు కబ్జాపై ప్రశ్నించగా, ఇన్ని రోజులు గుట్టలు, చెరువులు మాయం చేస్తుంటే ఏం చేశారు? ఇప్పుడు మీకు కమీషన్లు ఇవ్వకపోవడంతో ప్రశ్నిస్తున్నారా? మొరం, గుట్టలను ఆక్రమిస్తే ఇన్ని రోజులు ఏం పీకారు అని పరుషపదజాలంతో మత్స్యకారులు, సీపీఏం నాయకులపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.
అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది.
--దొండ ప్రభాకర్,సీపీఐ ఏంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు
ఇటిక్యాల చెరువు కబ్జాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది. ఎఫ్ టీ ఎల్, బఫర్ లను గుర్తించకుండా అధికారులను అడ్డుకుంటున్నది ఎవరూ?
కెనాల్ ను మట్టితో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నింపుతున్న కూడా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు చేస్తాం.