03-05-2025 08:40:34 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో స్పెషల్ సెంట్రల్ అసిస్టెంన్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V. Patil) శనివారం ప్రారంభించారు. గతంలో ఐ.టి.ఐ. వెల్డింగ్ ట్రేడ్‌లో శిక్షణ పొంది, ప్రస్తుతం వెల్డింగ్‌ను జీవనోపాధిగా ఎంచుకున్న జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 20 మంది గిరిజన యువతకు, రుద్రంపూర్‌లోని ఐ.టి.ఐ. కాలేజీలో ఒక నెలపాటు బెడ్స్, టేబుల్స్, ఆఫీస్ చైర్స్ తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (SCA) స్కీం ద్వారా అమలు చేయబడుతోంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... “జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు అవసరమైన పర్నిచర్‌ను ఇప్పటి వరకు ఇతర జిల్లాల నుంచి తెప్పించేవారు. ఇకపై ఈ అవసరాలను స్థానికంగా శిక్షణ పొందిన యువత ద్వారానే తీర్చే విధంగా చర్యలు తీసుకుంటాం,” అన్నారు. ఇతర మండలాల్లో వెల్డింగ్ శిక్షణ పొందిన గిరిజన యువకులకు అవకాశాలు కల్పిస్తామని, శిక్షణ అనంతరం వారికి టూల్‌కిట్లు, అవసరమైన యంత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) విద్యా చందన, ఐ.టి.ఐ. కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్, స్టాఫ్ సభ్యులు, ఎపియం (ఫాం) ఎల్. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.