20-01-2026 07:10:09 PM
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రదేశం వద్ద మానేరు తీరంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కు వచ్చే భక్తులకు వసతి, మంచినీరు, స్నానపు ఘట్టాలు, దేవతల గద్దెల క్యూ లైన్లు ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం జాతర ప్రదేశం వరకు కోటి రూపాయలతో నిర్మించిన బిటి రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ... నీరుకుల్లాతో పాటు నియోజకవర్గంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు చోట్ల రూ.ఒక కోటి చొప్పున తారు రోడ్లు నిర్మించామని తెలిపారు. నీరుకుల్లా సమ్మక్క జాతరకు దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం అని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కోమండ్లపల్లె మీదుగా సుల్తానాబాద్ రాజీవ్ రహదారి వరకు కూడా రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ , సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, దేవాదాయ శాఖ ఈవో శంకర్, జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, జాతర కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, ఉప సర్పంచ్, మరియు పలు గ్రామాల సర్పంచ్ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , గ్రామస్తులు పాల్గొన్నారు.