గిరిజన కుటుంబాల ఆత్మనిర్భరతే లక్ష్యం..
గ్రామీణ ప్రగతి ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట, ఆగస్టు 19 (విజయక్రాంతి): గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించి, వారిని ఆర్థికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘గ్రామీణ ప్రగతి’ కార్యక్రమంను బుధవారం అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నాబర్డ్ సహకారంతో చెస్టెడ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ గిరిజన కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి జీవనోపాధి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు నాబార్డ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచ వచ్చు అని పేర్కొన్నారు. రెడ్డిగూడెం గ్రామంలో 301 గిరిజన కుటుంబాలకు వివిధ రకాల జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, స్థానిక వనరులు, వారి ఆసక్తికి అనుగుణంగా జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసి నిరంతర ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తునట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మేకల పెంపకం, పాడి పశువుల పెంపకం, కుట్టు మిషన్లు, కిరాణా షాపులు, కోళ్ల పెంపకం, పళ్ల తోటలు, తేనెటీగల పెంపకం, వెదురు ఉత్పత్తుల తయారీ వంటి పలు రంగాల్లో గిరిజన కుటుంబాలకు అవకాశాలు కల్పిస్తునట్టు తెలిపారు. ఆత్మ నిర్భరతే ప్రధాన లక్ష్యంగా గిరిజన కుటుంబాలకు తాత్కాలిక సహాయం అందించడంతో పాటు, వారు స్వయంగా ఆదాయం సంపాదించుకొనేలా చేయడమే ‘గ్రామీణ ప్రగతి’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళలు, యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబాల ఆర్థిక స్థిరత్వం తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. నా బర్డ్ _చెస్టెడ్ సహకారంతో చెస్టెడ్ ఎన్ జి ఓ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించి, వారిని ఆర్థికంగా స్వావలంబనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






