కూరగాయల వ్యాపారుల సమస్యలపై ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్ష
వ్యాపారులంతా ఐక్యంగా ఉండి నష్టాలు లేకుండా వ్యాపారం సాగించాలి
ఇల్లందు టౌన్, ఆగస్టు 4 (విజయక్రాంతి): నూతన కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లో నెలకొన్న సమస్యలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.
మార్కెట్ సముదాయంలో దాదాపు 96 దుకాణ గదులు ఉన్నప్పటికీ నిర్మాణం, రూపకల్పనలో లోపాల కారణంగా ముందువైపు ఉన్న సుమారు 20 దుకాణాల్లో మాత్రమే వ్యాపారం సజావుగా సాగుతుండగా, మిగిలిన దుకాణాల్లో వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
మార్కెట్లోకి వినియోగదారులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాపారుల సమస్యలను విన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి వ్యాపారికి కేటాయించిన దుకాణంలోనే వ్యాపారం నిర్వహించాలన్నారు. వ్యాపారుల మధ్య విభేదాలకు తావులేకుండా అందరూ ఐకమత్యంతో కొనసాగాలని, సమిష్టిగా కమిటీ ఏర్పాటు చేసుకుని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళితే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో చిరు వ్యాపారుల కోసం నూతన మార్కెట్ సముదాయాన్ని నిర్మించిందని గుర్తు చేసిన ఎమ్మెల్యే, మార్కెట్ చుట్టూ త్వరలోనే షెడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర, మున్సిపల్ కమిషనర్ సందీప్, టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోళ్ళ సూర్యం, కో-ఆప్షన్ సభ్యుడు మడుగు సాంబమూర్తి, మాజీ టౌన్ అధ్యక్షుడు దొడ్డా డానియల్ పాల్గొన్నారు.






