10-01-2026 10:00:58 PM
కామారెడ్డి ముదిరాజ్ సంఘ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): ముదిరాజుల శక్తి రాష్ట్రమంతా తెలిసిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డిలో ముదిరాజ్ సంఘ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... 2023 నవంబర్ అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో కామారెడ్డి ముదిరాజుల శక్తి రాష్ట్రమంతా దేశమంతా తెలిసిందని ముదిరాజుల ఐక్యత తో వినూత్న తీర్పు కామారెడ్డి లో వచ్చిందని అన్నారు. ఆ తీర్పుతో ముదిరాజుల శక్తి దేశం, రాష్ట్రమంతటా రుజువైందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు.
కామారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం భవనంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో సదర్ సంఘంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యత గొప్పదన్నారు. గత 2023 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో కామారెడ్డిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను ఓడించారని తనను 7 వేల మెజారిటీతో గెలిపించారని తన జీవితంలో మర్చిపోలేని విషయమని ఎమ్మెల్యే రమణారెడ్డి గుర్తు చేసుకున్నారు.
కామారెడ్డి పట్టణం ముదిరాజ్ సంఘంకి సుమారు 30 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు, ఫర్నిచర్ కు సామాగ్రికి సహకరించానని మళ్లీ ఏ అవసరం వచ్చినా తాను నెరవేర్చుతానని చెప్పారు. ముదిరాజులు సంఘటితం కావాలని ఆకాంక్షించారు. ముదిరాజులను బిసి-డి నుండి ఏ గ్రూపులోకి మార్చుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని నెరవేర్చాలని కామారెడ్డి ఎమ్మెల్యే పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ముదిరాజులకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ముదిరాజులు పౌరుషము గలవారని మాట ఇస్తే వెనక్కి రారని, మాటకు కట్టుబడి ఉంటారని బిజెపి ఎమ్మెల్యే చెప్పారు.
యువతకు ఉపాధి లేక జీవన సమస్య ఎదురవుతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో వస్తున్నాయని, సదర్ సంఘం సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పట్టణ ముదిరాజ్ సంఘానికి మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజులు బిజెపికి సహకరించాలని కోరారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజులు అత్యధిక సంఖ్యలో ఉన్నారన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్య రంగాల్లో ముదిరాజులు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.