calender_icon.png 11 January, 2026 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయ ఆత్మ.. సోమ్‌నాథ్ ఆలయ చరిత

11-01-2026 01:24:49 AM

గుజరాత్ ప్రభాస పటన్‌లోని చారిత్రక సోమ్‌నాథ్ ఆలయాన్ని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. ఆ పవిత్ర క్షణాల కోసం యావత్ భారతావని ఎదురుచూస్తున్నది. భారతీయ ఆత్మకు, సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే ఈ ఆలయంపై క్రీ.శ 1026లో గజనీ మహమ్మద్ తొలి మహాదాడికి పాల్పడ్డాడు. ఆ దాడి జరిగి సరిగ్గా వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా నాలుగు రోజుల పాటు ‘సోమ్‌నాథ్ స్వాభిమాన పర్వ’ వేడుకలు జరుగనున్నాయి. ఇవి కేవలం ఉత్సవాలు మాత్రమే కావు.

అవి భారతీయ ఆత్మలో నిబిడీకృతమై ఉన్న అద్భుత సహనశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వేడుకలు. ఆధునిక భారత దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఈ క్షేత్రం ఒక దిక్సూచిలా నిలుస్తోంది. సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న ప్రధాని మోదీ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని రక్షించే క్రమంలో ప్రాణాలర్పించిన వీర యోధుల గౌరవార్థం ‘శౌర్యయాత్ర’కు ఆయన నేతృత్వం వహించను న్నారు. మహాశివుడి 12 జ్యోతిర్లింగాల్లో సోమ్‌నాథ్ క్షేత్రానిదే అగ్రస్థానం.

క్రూరమైన ఆక్రమణదారులు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, నిరంతర కాలప్రవాహాన్ని తట్టుకుని ఈ ఆలయం నేటికీ నిలబడింది. విధ్వంసానికి గురైన ప్రతిసారీ ఆలయం కొత్త పునర్జన్మ పొంది మన కళ్ల ముందు సజీవంగా సాక్షాత్కరిస్తోంది. ఆలయ మూలాలు ప్రాచీన హిందూ పురాణాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. చరిత్ర లిఖించక ముందే ఈ క్షేత్రం వెలిసినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి. శివ పురాణం, స్కంద పురాణం ప్రకారం చంద్రదేవుడైన సోముడు మహాశివుని పట్ల తన భక్తికి గుర్తుగా ఈ ఆలయాన్ని మొద ట నిర్మించాడు.

తన మామ దక్షుడి శాపం అనుభవించాల్సిన పరిస్థితిలో ఉన్న సోము డు ప్రభాస పటన్‌లో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. సోముడి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు అతడికి తిరిగి కాంతిని ప్రసాదించాడు. అందుకు కృతజ్ఞతగా సో ముడు బంగారంతో ఒక మహత్తర ఆలయా న్ని ఇక్కడ నిర్మించాడు. ఈ పురాణ పునాది సోమ్‌నాథ్ ఆలయం కేవలం ఒక కట్టడంగా కాకుండా సృష్టి సమతుల్యతకు ప్రతీకగా నిలిచింది.

కేవలం భక్తికి సంబంధించింది కాదు..

సోమ్‌నాథ్ ఆలయ చరిత్ర కేవలం భక్తికి సంబంధించింది మాత్రమే కాదు. విదేశీ ఆక్రమణదారులు జరిపిన విధ్వంసం ఒక భాగ మైతే భారతీయుల అచంచల సంకల్ప బలం తో జరిగిన పునర్నిర్మాణాలు మరో భాగం. క్రీస్తుశకం 725లో సింధ్ -అరబ్ పాలకుడు అల్-జునైద్ తొలిసారిగా ఈ ఆలయాన్ని దోచుకుని నాశనం చేశాడు. ఆ తర్వాత చాళుక్య రాజులు ఎర్ర ఇసుకరాయితో ఆలయాన్ని పునర్నిర్మించారు. క్రీస్తుశకం 997 నాటికి ఇది అద్భుత శిల్పకళా కావ్యంగా విరాజిల్లింది.

అయితే క్రీస్తుశకం 1026లో గజనీ మహమ్మద్ అత్యంత భీకరమైన దాడికి పాల్పడ్డాడు. తన 15వ దండయాత్రలో భాగంగా 30 వేల మంది సైన్యంతో ఎడారులను దాటి వచ్చి ఈ ఆలయాన్ని చేరుకున్నాడు. ఆలయ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులను హతమార్చి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. కోట్ల విలువైన బంగారం, రత్నాలను దోచుకెళ్లాడు. ఈ దాడిలో సుమారు 50 వేల మంది భక్తులు మరణించినట్లు అంచనా. ఆలయ విగ్రహ విధ్వంసమే ప్రధాన లక్ష్యంగా ఈ దండయాత్ర సాగిందని చరిత్రకారులు చెబుతారు.

ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని..

మానవ నిర్మిత దాడులే కాకుండా భ యంకరమైన ప్రకృతి వైపరీత్యాలను కూడా సోమ్‌నాథ్ ఆలయం ఎదుర్కొంది. గుజరాత్ తీరం తుఫానులు, భూకంపాలకు నిలయమైనప్పటికీ ఆలయ అస్తిత్వం మాత్రం చెక్కు చెదరలేదు. 1819లో వచ్చిన భారీ భూ కంపం అనేక కట్టడాలను పడగొట్టినా ఆలయ శిథిలాలు నిలిచే ఉన్నాయి. 2001 లో సంభవించిన భుజ్ భూకంపం సమయంలో ఆధునిక ఆలయం ధైర్యంగా నిలబ డింది. అరేబియా సముద్రం నుంచి వచ్చే బలమైన అలల తాకిడిని తట్టుకునేలా ఇప్పుడు పటిష్టమైన సముద్ర రక్షణ గోడలు నిర్మించారు.

తీరక్షయాన్ని అరికట్టేందుకు అడవుల పెంపకం వంటి చర్యలు చేపట్టారు. ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నా భక్తుల సందడి ఏమాత్రం తగ్గలేదు. ఇది దైవశక్తికి, మానవ సహనానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనం. వాస్తుశిల్పి ప్రభాశంకర్ సోంపురా చాళుక్య శైలిలో ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 150 అడుగుల ఎత్తున శిఖరాన్ని భూకంపాన్ని ఎదుర్కొనే విధంగా నిర్మించి భవిష్యత్‌తరాలకు అందించారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో..

ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమ్‌నాథ్‌ని ఆలయ వారసత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 2011 నుంచి ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న ఆయన ప్రభాస పటన్ మ్యూజియం నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించారు. యాత్రికుల కోసం అంతర్జాతీయ స్థాయి వసతుల అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వెయ్యేళ్లలో ఎన్నో గాయాలైనా ధైర్యంగా నిలబడిన ఈ ఆలయం భారతదేశ అజేయమైన ఆత్మకు నిదర్శన మని ఆయన కొనియాడారు.

భారతదేశాన్ని ఎవరూ ముక్కలు చేయలేరని సోమ్‌నాథ్ చరిత్ర ప్రపంచానికి నిరూపించిందని ప్రధాని తన తాజాగా పేర్కొన్నా రు. ప్రస్తుతం ఉన్న ఆలయం 3.5 ఎకరాల విస్తీర్ణంలో నగర శైలిలో కనువిందు చేస్తోంది. వెయ్యికి పైగా శిల్పకళా శోభితమైన స్తంభాలు ఇక్కడ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. వైదిక విద్యకు, సంస్కృత భాషా అధ్యయనానికి కూడా ఈ క్షేత్రం ప్రధాన కేంద్రంగా మారింది. క్రూరమైన బలం ఒక కట్టడాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే పవిత్రమైన విశ్వాసం దానిని మళ్లీ నిర్మిస్తుందని సోమ్‌నాథ్ ఆలయ చరిత్ర మనకు నిరంతరం గుర్తుచేస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సోమ్‌నాథ్ ఆలయ సమకాలీన ప్రాధాన్యతను చాటిచెబుతున్నారు. 2026 జనవరి 5న ఆయన తన సోషల్ మీడియా ద్వారా ‘అచెంచల విశ్వాసానికి వెయ్యేళు’్ల అంటూ ఆలయ వారసత్వంపై తన ఆలోచనలను పంచుకున్నారు. పదేపదే దాడులకు గురైనప్పటికీ ప్రతిసారీ శిథిలాల నుంచి పైకి లేచిన సోమ్‌నాథ్ భారతదేశ సహనానికి, ఆత్మవిశ్వాసానికి శక్తిమంతమైన ప్రతీక అని ఆయన కొనియాడారు. వేల గాయాలైనా చెక్కుచెదరని ఈ క్షేత్రం జాతి అజేయమైన ఆత్మకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.

సోమ్‌నాథ్ పునరుజ్జీవనం నుంచి మనం ఒక శాశ్వత పాఠం నేర్చుకున్నామని భారతదేశాన్ని ఎవరూ ముక్కలు చేయలేరని ఆయన స్పష్టం చేశారు. వికసిత భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో ఈ క్షేత్రం ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. ఈ ఆలయ నిర్మాణంలో కోటా రాయి, మార్బుల్ ఉపయోగించగా 1999లో భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారు పూత పూసిన ద్వారాలు ఆలయానికి మరింత శోభను ఇస్తున్నాయి.

సాంస్కృతికంగా మహాశివరాత్రి వంటి పండుగలకు సోమ్‌నాథ్ ఆలయం కేంద్రంగా నిలుస్తూ లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. సంస్కృత భాషా అధ్యయనం, వైదిక కర్మకాండల పరిరక్షణకు కూడా ఈ క్షేత్రం పెద్దపీట వేస్తోంది. 2026 జనవరి 11న ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని సందర్శిస్తున్న తరుణంలో సోమ్‌నాథ్ ఆలయం గత కాలపు జ్ఞాపకంగా కాకుండా భవిష్యత్తుకు ఇచ్చిన హామీలా కనిపిస్తోంది. గడిచిన వెయ్యేళ్లలో 17 సార్లు భారీ దాడులు, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా ప్రతిసారీ మరింత బలంగా ఎదిగి నిలిచిన ఈ క్షేత్రం భారతీయ నాగరికత అజేయమైన శక్తికి తిరుగులేని నిదర్శనం. 

ఎన్నో చారిత్రక ఆధారాలు

భారత పురావస్తు శాఖ నిర్వహించిన లోతైన తవ్వకాల్లో సోమ్‌నాథ్ ఆలయ చారిత్రక ఆధారాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సింధు లోయ నాగరికతను పోలిన ముద్రలు, ప్రాచీన మట్టి పాత్రలు ఇక్కడ లభించాయి. క్రీ.పూ 8వ శతాబ్దానికి చెందిన అవశేషాలు ఈ ప్రాంతం ప్రాచీనతను బలంగా చాటుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఋగ్వేదంలో కూడా ప్రభాస పటన్ ఒక పవిత్ర తీర్థస్థలంగా ప్రస్తావనకు వచ్చింది. వేదకాలం నాటి వైదిక కర్మకాండలతో ఈ పుణ్య భూమికి విడదీయలేని బంధం ఉంది.

గుప్తుల కాలంలో ఈ తీర్థస్థలం మరింత వైభవాన్ని సంతరించుకుంది. శైవ మతానికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా మారింది. సోమ్ (చంద్రుడు), నాథ్ (దేవుడు) అనే పదాల కలయికతో సోమ్‌నాథ్ అనే పేరు ఆలయాన్ని స్థిరపడింది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రాంతం అనాదిగా దేశ విదేశీ యాత్రికుల ను విశేషంగా ఆకర్షిస్తోంది. చారిత్రక గ్రంథాలు సైతం సోమ్‌నాథ్ ఆలయాన్ని పరమ పవిత్రమైన జ్యోతిర్లింగమని కీర్తించాయి.

గజనీ..ఔరంగజేబు విధ్వంసం

గజనీ దాడి తర్వాత సోలంకీ రాజు మొదటి భీముడు క్రీస్తుశకం 1042 లో సోమ్‌నాథ్ ఆలయాన్ని మళ్లీ నిర్మించాడు. కుమారపాలుడు అనే రాజు వెండి ద్వారాలతో ఆలయానికి మరింత శోభను చేకూర్చాడు. కానీ క్రీస్తుశకం 1299లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్  సైన్యం మళ్లీ విరుచుకుపడింది. ఆలయాన్ని దోచుకుని అర్చకులను ఊచకోత కోశారు. ఆ తర్వాత కూడా జఫర్ ఖాన్ వంటి పాలకులు పలుమార్లు దాడులు చేసి అపార నష్టాన్ని కలిగించారు.

క్రీస్తుశకం 1665లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసి మసీదుగా మార్చాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు. 18వ శతాబ్దం నాటికి అక్కడ కేవలం శిథిలాలు మాత్రమే మిగిలాయి. కాలప్రవాహంలో అది ఒక మరిచిపోయిన జ్ఞాపకంగా మారిపోయింది. బ్రిటిష్ పాలనలో కూడా ఈ పవిత్ర ప్రదేశం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. గజనీలో ఉన్న సోమ్‌నాథ్ ఆలయ ద్వారాలను తిరిగి తెచ్చేందుకు లార్డ్ ఎల్లెన్బరో చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. 

పటేల్.. మహాత్మాగాంధీ పట్టుదలతోనే..

భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత సోమ్‌నాథ్ ఆలయ చరిత్రలో సరికొత్త యుగం ప్రారంభమైంది. 1947 నవంబర్ 13న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని పునః నిర్మిస్తానని జూనాగఢ్ ప్రజాసభలో చారిత్రాత్మక ప్రతిజ్ఞ చేశారు. విభజన అనంతరం జాతీయ ఐక్యతకు ఇది గొప్ప ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తల నుంచి నిధులు సేకరించి సోమ్‌నాథ్ ట్రస్ట్‌ను స్థాపించారు.

మహాత్మా గాంధీ కూడా ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా సమర్థించారు. అయితే ప్రభుత్వ నిధులు కాకుండా కేవలం ప్రజల విరాళాలతోనే పుణ్యకార్యం జరగాలని గాంధీజీ పట్టుబట్టారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూరాజేంద్ర ప్రసాద్ 1951 మే 11న శివలింగ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కొంత వ్యతిరేకించినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం వెనక్కి తగ్గలేదు. సోమ్‌నాథ్ ఆలయ పునరుద్ధరణ మొత్తం భారత జాతికి గర్వకారణమని ఆయన సగర్వంగా ప్రకటించారు.

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి