26 April, 2026 | 4:01 AM

కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి?

26-06-2024 01:55 AM

ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్యే

ఫాంహౌజ్‌లో కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా

పటాన్‌చెరు, జూన్ 25 : పటాన్‌చెరు ఎమ్మెల్యే దారి ఎటువైపు? అన్న చర్చ ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ మొదలైంది. ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ మంగళవారం జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఎమ్మెల్యే కూడా అక్కడి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదేవిధంగా ఎర్రవల్లిలోని గులాబీ బాస్ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికీ ఎమ్మెల్యే హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.  కొద్దిరోజుల నుంచి ఎమ్మెల్యేతో ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మధుసూదన్‌రెడ్డి ఇటీవల ఓ విషయంపై అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ను వీడితే మంచి జరుగుతుందని కుటుంబీకులు ఎమ్మెల్యేను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం జరగడంతో ఇటీవల జిన్నారం శివారులోని ఓ ఫాంహౌజ్‌లో ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సీక్రెట్  సమావేశం సైతం ఏర్పాటు సమాచారం. తమ అభిప్రాయాన్ని గౌరవించకుండా ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే, గాంధీ భవన్ వద్ద ఆందోళన చేస్తామని అధిష్ఠానానికి సంకేతాలు పంపినట్లు తెలిసింది.