మంత్రిని కలిసిన పౌల్ట్రీ రైతులు
రంగారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి) : షాద్‌నగర్ నియోజకవర్గంలోని చటాన్‌పల్లి, సోలిపూర్ గ్రామాలకు చెందిన పలువురు పౌల్ట్రీ రైతులు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిశారు. కాపా రామారావు, మాకినేని వెంకటనారాయణ, శ్రీనివాస్‌రావులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి పలు సమస్యలు విన్నవించారు. పౌల్ట్రీ పరిశ్రమలపై ఆస్తిపన్ను బకాయిలను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ పరిధిలోని పౌల్ట్రీ పరిశ్రమలకు ఆస్తి పన్ను వేయలేదని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని పౌల్ట్రీ పరిశ్రమలపైనే ఆస్తిపన్ను విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం, పౌల్ట్రీని ఒక యూనిట్ గా చేసి రూ.100 మాత్రమే మెయింటేనెన్స్ కింద వసూలు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతులు పేర్కొన్నారు.






