22 April, 2026 | 2:40 AM

డాక్టర్ల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పాయల్ అసంతృప్తి

22-04-2026 01:05 AM

రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పాయల్ శంకర్

వైద్యుల ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని వెల్లడి

ఆదిలాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): పేదలకు వైద్య చికిత్సలు అందించేందుకు జిల్లాలో ఏకైక రిమ్స్ ఆస్పత్రి పని తీరుపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రిమ్స్‌ను  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.

పలు వార్డుల్లో రోగులతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు. రిమ్స్ పారిశుద్ధ్య లోపంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. రిమ్స్‌లోని పలు కిటికి అద్దాలు పగిలి ఉండటం, అక్కడక్కడ గుట్కా, పాన్ మసాలను వాడుతూ ఉమ్మివేసిన దృశ్యాలు కనిపించడంతో వీటిని  ఎప్పటికప్పుడు శుభ్రంపై దృష్టి సారించాలని డైరెక్టర్‌కు సూచించారు. ల్యాబ్ ను పరిశీలించి రక్త నమూనాల సేకరణలో  మిస్సింగ్ జరగడం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

రిమ్స్ లోని వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ రోగులకు అందిస్తున్న వైద్యం, వారి విధుల పట్ల ఆరా తీశారు. వేసవి కాలం కారణంగా జిల్లాలో ముదురుతున్న ఎండలతో రోగులు ఇబ్బందులు పడకుండ అవసరమున్న చోట కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఎప్పటికప్పుడు వేస్టేజీని వేరు చేసి శుభ్రం చేయాలని, లిఫ్ట్ మరమ్మత్తులు చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఆస్పత్రి నిర్వహణకు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. రూ.150 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషలిటి ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో చిన్నపాటి చికిత్సలకు సైతం రోగులు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్ పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి వైద్యుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు బోడిగం శ్రీకాంత్, నాయకులు కృష్ణ యాదవ్, పాయల్ శరత్, నిఖిల్, మనోజ్, వైద్యులు తదితరులున్నారు.