18 May, 2026 | 3:16 AM

నాణ్యతలో రాజీ పడొద్దు.. పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

18-05-2026 02:22 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం

బాన్సువాడ, మే 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నిజాంసాగర్ ప్రాజెక్టు నాన్-కమాండ్ ప్రాంతాలకు సుమారు 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందించాలని, రైతులు ఆర్థికంగా స్థిరపడాలని ఆ పెద్దాయన తపన పడ్డారు. 1 TMC కెపాసిటీతో నిర్మాణంలో ఉన్న సిద్ధాపూర్ రిజర్వాయర్ ద్వారా భవిష్యత్తు తరాల రైతులు సాగునీటికి ఇబ్బందులు పడకుండా పంటలు పండించుకోవాలని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలనేది ఆ పెద్దాయన ఆశయం. ఆ ఆశయ సాధనలో భాగంగానే మండు టెండను సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

మండుటెండను లెక్కచేయని ఎమ్మెల్యే పోచారం 

44 డిగ్రీల భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం మండుటెండను. సోమవారం బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. 1 TMC సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనులను ప్రాజెక్టు సైట్లో కలియదిరుగుతూ నాణ్యత, పురోగతిని అధికారులు, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ, ‘రిజర్వాయర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.  భవిష్యత్తు తరాలు సాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండాలనేది మన లక్ష్యం‘ అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.