05-02-2026 01:19:50 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యేకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లుగా పిటిషన్ దాఖలవ్వగా.. దానిపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంజయ్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవ ని బుధవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పష్టం చేశారు.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు దాఖలవ్వగా.. ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఇలాఉండగా, పార్టీ ఫిరాయింపు కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. తాను బీఆర్‌ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానని, ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని స్పష్టం చేశారు.
స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన వారిలో..
పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటివరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చిన వారిలో భద్రాచలం- తెల్లం వెంకట్రావు, బాన్సువాడ-పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల- సంజయ్‌కుమార్, చేవెళ్ల-కాలె యాదయ్య, గద్వాల్-బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ - ప్రకాష్‌గౌడ్, పటాన్ చెరు -గూడెం మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి-అరికెపూడి గాంధీ ఉన్నారు.
కడియం విచారణ 19కి వాయిదా
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎదుట బుధవారం విచారణకు హాజరయ్యారు. కడియంపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా విచారణకు హాజరై తన వాదనలు వినిపించారు. ఇద్దరు ఎమ్మెల్యేల వాదనలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మార్ రికార్డ్ చేశారు. కడియం శ్రీహరి పార్టీ మారినట్లుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను స్పీకర్‌కు అందించారు. తాను పార్టీ మారలేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
మున్సి పల్ ఎన్నికలు, ఫలితాలు అన్నీ పూర్తయ్యాక ఈనెల 19న మరోసారి విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేశారు. ఈనెల 18న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కూడా మరోసారి విచారణకు హాజరు కావాలని రెండ్రో జుల క్రితం స్పీకర్ ఆదేశించారు. వీరిద్దరి విచారణ పూర్తయ్యాక అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచా రం. దానం నాగేందర్ విషయంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శ్రీహరి విచా రణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో పనిచేస్తూ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్ప డం హాస్యాస్పదమ న్నారు. నీతులు చె ప్ప డం ఆపి.. కాంగ్రెస్‌లో చేరినట్లు స్పీకర్ ఎదు ట అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి.. రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ విచారణలో కాలయాపన చేస్తూ.. అనర్హత నుంచి ఎమ్మెల్యేలను కాపాడే ప్రయ త్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నా
తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్‌లో చేరలేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ స్ప ష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేయడంపై బుధవారం జగిత్యాలలో సంజయ్‌కుమార్ మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. తాను కాంగ్రెస్‌లో చేరినట్లు సీఎం ఎక్కడా ప్రకటించలేదని చెప్పారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్
పక్కింటి సంసారంలో చిచ్చు
అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా? అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్‌కుమార్‌పై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడంతో ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో తెలిసిందని వ్యాఖ్యానించా రు. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు.
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కి కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫొటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థర హితమని విమర్శించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా సీఎం ఆదేశాల మేరకు నడుచు కోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేన్నారు. ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్‌చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్