21 July, 2026 | 12:34 PM

మురుగు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

21-07-2026 01:32 AM

చిట్యాల (రామన్నపేట), జూలై 20: రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మురుగు నీటి శుద్ధి కేంద్రం ద్వారా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.