మంచి రోజులు వచ్చే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంచి రోజులు వచ్చాయి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన 100 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్దిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతో కృషి చేస్తున్నామని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజలకు అందించే ఉచిత పథకాలు అందిస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవం పెంపొందిస్తున్నామని, మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఇంకా సులభతరం చేయుటకు ఇటీవల 1000 బస్సులు పెంచడం జరిగిందన్నారు.
రానున్న రోజుల్లో ఎక్కువ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని వివరించారు. గత పాలకులు చేసిన అప్పులు రూ.8 లక్షల కోట్ల తలకు మించిన భారంగా ఉన్నప్పటికీ, రూ.25 లక్షల కుటుంబాలను రైతు రుణమాఫీ ద్వారా రుణ విముక్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు ఏ ఆటంకం లేకుండా ప్రజా పాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని విధాలా సహకారం అందించే కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవాలన్నారు.






