20-07-2025 04:48:03 PM
హైదరాబాద్: భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాలు వైభవంగా సాగుతున్నాయి. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఇవాళ ఉదయం నుంచే పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. దీంతో భక్తులతో పలు ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆషాఢ మాస బోనాలు పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆమె ఎక్స్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు. అంతకు ముందు కవిత ఉదయం కార్వాన్ క్రాస్ రోడ్డులోని దర్బార్ మైసమ్మ తల్లిని దర్శించుకొని బోనం సమర్పించారు.