calender_icon.png 21 July, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువు..బరువు!

21-07-2025 12:58:21 AM

  1. యూరియా, డీఏపి మినహా  అన్ని రకాల ఎరువుల రేట్లు పెంపు
  2. ఏటేటా పెరుగుతున్న ధరలతో  రైతులకు పెట్టుబడి భారం
  3. నానో ఎరువుల వినియోగంపై అవగాహన కరువు

సంగారెడ్డి, జూలై 20(విజయక్రాంతి): రాయితీ ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. 28-28-0, డీఏపీ, యూరియా మినహా మిగతా వాటి ధరలు రూ.50 నుంచి రూ.350 వరకు పెంచి రైతులపై ఎనలేని భారాన్ని మోపాయి. ఏటేటా పెరుగుతున్న ధరల కారణంగా రైతులకు పంటసాగు భారంగా మారుతోంది. జిల్లాలో వానాకాలం సాగుచేసే వివిధ రకాల పంటలకు ఎరువులు అవసరమవుతుండగా పెరుగుతున్న ధరలు రైతుల నడ్డి విరుస్తున్నాయి.

ఇదిలావుండగా యూరియా, డీఏపీ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఈ రెండింటి అమ్మకాలకు ఆయా కంపెనీలు లింకు ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. లేకపోతే యూరియా, డీఏపీలను విక్రయించబోమని జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రైవేటు ఎరువుల డీలర్లు తేల్చి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. 

జిల్లాలో సాగు ఇలా..

జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల మంది రైతులు ఉన్నారు. వానాకాలంలో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికీ 3 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి, ఆముదం, కంది, జొన్న పంటలను సాగుచేశారు. ఇప్పుడిప్పుడే వరిసాగు పనులు సాగుతున్నాయి. పెరిగిన ఎరువుల ధరల కారణంగా రైతులకు అదనపు పెట్టుబడి భారం తప్పని పరిస్థితి నెలకొంది. 

నానో యూరియాపై అనాసక్తి...

మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపడితే మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం యూరియా స్థానంలో నానో యూరియాను ద్రవరూపంలో తీసుకొచ్చింది. ధర తక్కువగా ఉండే నానో ఎరువుల వినియోగంతో రైతులకు పెట్టుబడుల భారం తగ్గి దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయశాఖ నిపుణులు అంటున్నారు. రెండేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్ లోకి వచ్చినప్పటికీ, రైతులు మాత్రం ఆసక్తి చూపలేకపోతున్నారు.

ప్రస్తుతం వాడుతున్న సాదారణ యూరియాను పంటకు చల్లడం ద్వారా కేవలం 30 శాతం మాత్రమే పంటకు వెళ్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అదే నానో యూరియా 80 శాతం పంటకు వెళ్తుందని చెబుతున్నారు. అర లీటర్ డబ్బాలో లభించే నానో యూరియా 45 కిలోల బస్తాతో సమానం. రాయితీపోను యూరియా బస్తా ధర రూ.286 ఉండగా, నానో యూరియా రూ. 240కే లభిస్తుంది.

యూరియా తర్వాత రసాయన నానో డీఏపీని అందుబాటులోకి తెచ్చారు. ఒక బస్తా డీఏపీ 500 మిల్లీ లీటర్ల నానో డీఏపీతో సమానం. బస్తా డీఏపీ ధర రూ.1,250 ఉండగా.. నానో డీఏపీ రూ. 600కే లభిస్తుంది. అయితే నానో ఎరువుల వినియోగంతో కలిగే లాభాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

పాత, కొత్త ధరలు (రూ.లలో)(50 కిలోల బస్తా) ఇలా...

ఎరువు రకం పాత ధర కొత్త ధర

పొటాష్ 1,535 1,800

20-20-013 (ఫ్యాకట్స్) 1,300 1,425

20-20-013 (గ్రోమోర్) 1,300 1,350

20-20-013 (పీపీఎల్) 1,300 1,400

10-26-26 1,470 1.800

12-32-16 (ఇస్కో) 1,470 1,720

16-16-16 1.450 1,600

15-15-15-0-9 1,450 1,600

16-20-0-13 1,250 1,300

28-28-0 1,700 1,700

24-24-09 (మహాధన్) 1,700 1,800

20-20-013 (మహాధన్) 1.350 1,450

14-35-14 (గ్రోమోర్) 1,700 1,800

డీఏపీ 1,350 1,350

యూరియా 266.50 266.50

సేంద్రియ వ్యవసాయంతో మేలు..

పెరిగిన ఎరువుల ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఫర్టిలైజర్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది. ఈ ఎరువుల వల్ల భవిష్యత్లో భూసారం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు సాగుచేసే పంటలకు సేంద్రియ ఎరువులను వినియోగించడంతో భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు.

 శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి