అమెరికాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- హార్మొనీ డిస్ట్రిక్ట్ ‘మీట్ అండ్ గ్రీట్’ విజయవంతం
- టీటీజీఏ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అమెరికాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా గురువారం హార్మొనీ డిస్ట్రిక్ట్‌లో తెలుగు తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ (టీటీజీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ బిడ్డల నుంచి విశేష స్పందన లభించింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన తెలంగాణ వాసులు మల్లన్నకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న ప్రవాస ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలు, బీసీల రాజకీయ వెనుకబాటుతనం, అగ్రవర్ణాల దోపిడీ విధానాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా బీసీ రాజ్య స్థాపనే లక్ష్యంగా తాను ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో స్పష్టమైన కారణాలను వివరించారు.
ఎన్నారైల సంక్షేమం కోసం ఒక బలమైన పాలసీ ఉండాల్సిన ఆవశ్యకతను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. మల్లన్న ప్రసంగానికి, ఆయన ఆశయాలకు ప్రభావితులైన ఎన్నారైలు తాము చేస్తున్న రాజ్యాధికార పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లిన తీన్మార్ మల్లన్నను టీటీజీఏ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన టీటీజీఏ నిర్వాహకులకు, ప్రతినిధులకు, తరలివచ్చిన తెలంగాణ వాసులందరికీ తీన్మార్ మల్లన్న ధన్యవాదాలు తెలియజేశారు.






