నీరు నిలిచే ప్రాంతాలను తనిఖీ చేసిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
ఘట్ కేసర్, జూన్ 19 (విజయక్రాంతి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణితో కలిసి ప్రధాన నీరు నిలిచిపోయే ప్రాంతాలను విస్తృతంగా తనిఖీ చేసి, కొనసాగుతున్న వర్షపునీటి నిర్వహణ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఎంసి కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి రాంపల్లి ఎక్స్ రోడ్ వద్ద నీరు నిలిచిపోయే ప్రాంతాన్ని తనిఖీ చేసి, వర్షపునీటిని సులభంగా మళ్లించడానికి భారీ వర్షాల సమయంలో ముంపును నివారించడానికి బాక్స్ డ్రెయిన్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హెచ్‌ఎండిఏ అధికారులను ఆదేశించారు.
అలాగే పోచారం డివిజన్ పరిధిలోని అరుంధతి కాలనీ, హిమగిరి కాలనీ, ఎన్ .టి. పి.సి. చౌరస్తా, స్వర్ణగిరి కాలనీ, జోడిమెట్ల చౌరస్తా, ఘట్కేసర్ లోని బుగ్గనగర్ కల్వర్ట్ వద్ద నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలను, కూడా తనిఖీ చేసి, వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరేష్ కుమార్, హైడ్రా జోనల్ ఇంచార్జ్ మోహన్ రావు, హెచ్.యం.డి.ఎ. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివారెడ్డి , ఘట్కేసర్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ రవి కిరణ్, విశేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.






