06-11-2025 08:18:15 AM
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని సాకుతో కొంతమంది దుండగులతో కలిసి ఇంట్లోకి వెళ్లి ముకుమ్మడిగా వ్యక్తిపై దాడి(Mob attack) చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) కోడేరు మండలం పసుపుల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మిద్దె ఎజ్రా అనే వ్యక్తి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి నుండి అవసరం నిమిత్తం డబ్బులు అప్పుగా తీసుకోగా పరిస్థితి అనుకూలించక తిరిగి చెల్లించలేకపోయాడు. కొంతకాలంగా అడిగి విసిగి వేసాగిన సదరు వ్యక్తులు మరి కొంతమంది వ్యక్తులను వెంటబెట్టుకుని మంగళవారం సాయంత్రం తన ఇంటి వద్దకు వచ్చి మూకుమ్మడిగా దాడికి తెగబడినట్లు బాధితుడు ఆరోపించారు.
ప్రాణ భయంతో అదే సమయంలో డయల్ 100 కాల్ చేసి పోలీసులను ఆశ్రయించగా సదురు పోలీస్ అధికారి తిరిగి అదే నిందితులకు అప్పగించినట్లు బాధితుడు మిద్దె ఎజ్రా ఆరోపించాడు. రాత్రంతా ఓ రెస్టారెంట్లో బందించి చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. బుధవారం ఉదయం స్థానిక డిఎస్పి(Deputy Superintendent of Police) బుర్రి శ్రీనివాసులకు తన భార్య ఫిర్యాదు చేయగా వారి సూచన మేరకు బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఇదే విషయంపై కోడేరు మండల ఎస్సై జగదీశ్వర్ ను వివరణ కోరగా మిద్దె ఎజ్రా అనే వ్యక్తి ఒక చీటర్ గ్రామాల్లోని కొంతమంది వ్యక్తుల వద్ద డబ్బులు అప్పుగా తీసుకొని ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. అప్పు చేసిన డబ్బులు ఇవ్వమని కోరడం మినహా తనపై ఎవరు దాడి చేయలేదన్నారు.