calender_icon.png 6 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరిగేషన్‌కు నిధులు ఇల్లే!

06-11-2025 01:44:33 AM

ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్, దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల పూర్తిపై అనుమానాలు

  1. ఇప్పటికే సుమారు రూ. 14000 కోట్ల పెండింగు బిల్లులు
  2. ప్రతినెలా ఖర్చుచేసేది సగటున రూ. 500 కోట్ల వరకే
  3. సుమారు రూ. 95 వేల కోట్ల ప్రాజెక్టులు పూర్తయ్యేదెన్నడు?
  4. ప్రాజెక్టులన్నీ గడువులోగా పూర్తి చేయాలంటే ఏటా 33 వేల కోట్ల బడ్జెట్ అవసరం

* పేరుకు టాప్ ప్రయారిటీ.. ప్రచారంలోనూ టాప్ ప్రయారిటీ.. కానీ వాస్తవంలో చూస్తే, ఎక్కడా అంతగా ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు.. బడ్జెట్ కేటాయింపులు లేవు.. అసలు ఫైనాన్సియల్ ప్లానింగ్ అనేదికూడా కనపడదు. ఇదీ స్థూలంగా.. రాష్ట్రంలోని నీటి  పారుదల శాఖ పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాపాలన  మొదలైన తరువాత సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళుతున్నామని  ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు.. అసలు   నీటిపారుదల శాఖకు బడ్జెట్ కేటాయింపులపై దృష్టి సారించినట్టుగా కనపడటం లేదు. అంతేకాదు, సభల్లో నీటి    పారుదల ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాధినేతలు.. బడ్జెట్ కేటాయింపులు అధః పాతాళంలో ఉంటున్న విషయాన్ని గుర్తించడం లేదు.

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదానికి గురైన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రె స్ ప్రభుత్వం ప్రాజెక్టులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న ప్రాజెక్టులపై ప్రకటనల విషయంలో మాత్రం దూకుడుగానే ముందుకుపోతోంది. ఎక్క డ సభలు, సమావేశాలు జరిగినా.. ఇన్ని వేల కోట్లతో అవి సాగుతున్నామంటూ ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్మా ణ పనులు ప్రారంభమైన పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల లాంటి ప్రాజెక్టులను తమ హయాంలోనే పూర్తిచేస్తామని, ఇవన్నీ తమ ప్రభు త్వానికి ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా చెబుతున్నా రు.

అలాగే తాజాగా టన్నెల్‌లో ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్)ని కూడా అత్యాధునిక సాంకేతికతతో 2027 చివరి నాటికి పూర్తి చేస్తామం టూ ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక కాళేశ్వరంపై నెలకొన్న ఆరోపణలు, వివాదాలు, విచారణ నేపథ్యంలో ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రాణహిత మరోసారి తెరపైకి తీసుకొచ్చి ఎంతటి ఖర్చు అయినా భరించి పూర్తిచేస్తామని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.

బడ్జెట్ ఎలా..?

నిజానికి తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమనేది ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రకటనలు చేయడంలో మాత్రమే.. ముందుంటున్నది. కానీ బడ్జెట్ కేటాయింపు ల్లో మాత్రం ఆ దిశగా సాగడం లేదు. పైన పేర్కొన్న ఐదు ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలోనే సుమారు రూ. 95 వేల కోట్ల నిధు లు అవసరం. కానీ ఆ స్థాయిలో కేటాయింపు లు మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనపడ టం లేదు. ఇప్పటికే రెండేళ్ల కాలం ఈ ప్రభుత్వానికి పూర్తయ్యింది.

మరో మూడేండ్ల కా లం మాత్రమే ఉంది. ఈ మూడేండ్లలో అనుకున్న, ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేస్తా మని చెబుతోన్న ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఎలా పూర్తి చేస్తుందా అని రాజకీయ విశ్లేషకులు, సాగునీటి రంగ నిపుణులు ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ మూడేండ్లలోనైనా వాటిని పూర్తి చేయాలం టే.. కనీసం యేటా రూ.33 వేల కోట్ల నిధులు అవసరం. ఆ స్థాయిలో నిధుల ను కేటాయిస్తారా అనేది అంత నమ్మశక్యంగా లేదు.

భారీ మొత్తంలో నిధులు అవసరం..

* కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మరోసారి తెర పైకి తీసుకొచ్చిన సర్కారు.. ఆదేశాలతో దీనిని సుమారు రూ. 35,000 కోట్లతో చేపడుతున్నట్టుగా నీటిపారుదల శాఖ అం చనాలు వేస్తోంది. 

* ఇప్పటికే పలు దశలను పూర్తిచేసుకున్న జె.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. దీనికోసం మరో రూ. 3,000 కోట్లు అవసరమని అంటున్నారు.

* ఇక గత ప్రభుత్వ హయాంలో 12.30 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందించాలని మొదలుపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సుమా రు రూ. 30 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. కరువు ఉమ్మడి జిల్లా లైన పాలమూరు, రంగారెడ్డితోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సంబంధించి ఇది ఎంతో ప్రాధన్యత ఉన్న ప్రాజెక్టు కను క.. ఇది పూర్తి చేయడానికి అదనంగా సుమారు రూ. 32,000 కోట్లు అవసరమని, ఇందుకు సంబంధించి ప్రణాళిక లను రూపొందించుకుని 2026 చివరి నాటికి దీనిని పూర్తిచేస్తామని సర్కారు ముందుకు వెళుతోంది.

* ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన సీతారామ ఎత్తిపోతల పథకం.. వాస్తవానికి సమైఖ్య రాష్ట్రంలో పనులుచేపట్టిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరసాగర్ రుద్రంకోట ఎత్తిపోతల పథకాలను కలిపి ఏర్పాటు చేసింది. సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. మొదట్లో రూ. 18,000 కోట్ల అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వం సవరించిన అంచనాలతో ఇంకా రూ. 19,800 కోట్ల ను ఖర్చుచేసి ప్రాధాన్యత ప్రాజెక్టుగా పూర్తి చేస్తామని చెబుతోంది.

* టన్నెల్‌లో దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి శవాలను సైతం వెలికితీయలేక పోతున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 2027 చివరి నాటికి రూ. 4,468 కోట్లతో వ్య యంతో పూర్తి చేస్తామని, దీనిని నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయడమే తమ ప్రాధాన్యమని చెబుతున్న ప్రభుత్వం ఆదేశాలతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

ఆర్థిక ప్రణాళిక ఏది..?

వాస్తవానికి ఎంతో ప్రాధాన్యతా అంశమ ని సాగునీటి ప్రాజెక్టులను పేర్కొంటున్న ప్రభుత్వం ఆ స్థాయిలో ఆర్థిక ప్రణాళికను రచిస్తున్న జాడలు కనపడటం లేదు. కేంద్రం నుంచి అందే సాయంపై నమ్మకం లేదు. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయాలి. కొత్త గా అప్పులు తీసుకురావాలి. అందుకుకూడా ఒక ప్రణాళిక అవసరం. బడ్జెట్ లేకుండా, ప్రణాళిక లేకుండా.. ఆర్థిక భారంతో కూడిన ప్రాజెక్టులను ఎలా పూర్తిచేస్తుందనేది అందరికీ ఆశ్చర్యకరంగానే కనపడుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకల నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిందే.

అయితే ఆర్థిక ప్రణాళికతోనే ఇది సాధ్యం. అయితే ఆ దిశగా ప్రభు త్వం దృష్టి పెట్టలేదనేదే కనపడుతోంది. ఇప్పటికే సుమారు రూ. 14 వేల కోట్ల పెండింగు బకాయిలున్న నేపథ్యంలో.. ప్రతి నెలా సుమా రు రూ. 500 కోట్ల వరకే పనులు జరుగుతు న్న సమయంలో.. సంవత్సరానికి సుమారు రూ. 33 వేల కోట్ల వరకు బడ్జెట్ ఉంటేగానీ పూర్తిగాని ప్రాజెక్టులున్న నేపథ్యంలో తూతూ మంత్రంగా ప్రసంగాలు, ప్రకటనలతో ఈ ప్రభుత్వం కాలం వెల్లబుచ్చుతుందా అనే అనుమానాలను రేకెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పకడ్బందీగా ఆర్థిక ప్రణాళిక ఉండటంతోపాటు.. అదే స్థాయిలో కమిట్‌మెంట్, ఆర్థిక అవకతవకలు జరక్కుం డా చూడటం.. అనుకున్న గడువులోగా పూర్తి చేస్తేగానీ.. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు నిజం కావు. అది ఎలా సాధ్యమని విమర్శకులు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఈ ప్రభుత్వం ప్రతి విమర్శలకే పరిమతిమవుతుందా.. లేక తాము ఎంతో ప్రాధాన్యంగా చెబుతున్న ప్రాజెక్టులను పూర్తిచేసి చూపెడుతుందా అని రాష్ట్ర ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నారు..!

రూ. 14 వేల కోట్ల పెండింగు బకాయిలు.. 

సాగునీటి శాఖకు సంబంధించి పెద్దవి.. చిన్నా.. చితకా అన్నీ కలుపుకుని రూ. 14,000 కోట్ల పెండింగు బిల్లులు ఉన్నాయని సమాచారం. ఇంత భారీగా పెండిం గు బిల్లులు చెల్లించాల్సి ఉన్న ప్రభుత్వం బడ్జెట్ విషయంలో కొసరి కొసరి కేటాయింపులు చేస్తోంది. పైగా ప్రతినెలా సగ టున సుమారు రూ. 500 కోట్లకు అటూ ఇటూగానే సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్న ప్రభుత్వం..

ఇప్పుడు ప్రాధాన్యతా ప్రాజెక్టులని చెప్పుకుంటున్న వాటికి ఖర్చు చేయాల్సిన సుమారు రూ. 95,000 కోట్లను ఎలా  కేటాయిస్తారనేది అంతుచిక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు, సాగు నీటి రంగ నిపుణులు తలలు బాదుకుంటున్నారు. ఇటు పెండింగు బకాయిలు పేరు కుపోతుంటే.. మరోవంక పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేయా ల్సి ఉందని.. పనిచూస్తే.. నత్తనడకన సాగుతుండటం.. ప్రభుత్వ పెద్దల ప్రకటనలకు, ప్రసంగాలకు పొంతన లేకుండాపోతోందని వారంటున్నారు.

కేంద్రం నుంచి సాయం అందేనా..? 

ఇప్పటికే రూ. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో.. ఎం తమేర నష్టం వాటిల్లిందో.. ఎంతటి వివాదాన్ని.. ఎంత విచారణ సాగిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు మరో రూ. లక్ష కోట్ల నిధులతో రాష్ట్రంలోని పలు కీలకమైన, ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏమైనా సహా యం అందుతుందా అంటే.. పెదవి విరుపే కనపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరిస్థితులను కేంద్రం నిధుల విడుదలను పరిశీలిస్తున్న రాజకీ య విశ్లేషకులు..

కేంద్రం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు సాయం అందుంతుందనే నమ్మకాన్ని మాత్రం వ్యక్తంచేయడం లేదు. ఏఐబీపీ కింద కొంత సాయంఅందినా.. అది అరకొరే అవుతుందని వారంటున్నారు. అంటే దాదాపు భారమంతా రాష్ట్ర ప్రభుత్వమే మోయాల్సి ఉంటుందని.. ఇది ఎంత వరకు నిజమవుతుందనేది వేచిచూడాల్సిన అంశమని వారంటున్నారు.