12 April, 2026 | 7:36 PM

ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

02-07-2025 01:33 AM
  1. విద్యుత్ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి 
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఆధునికయుగంలో వినియోగదారుల అవసరాలకు తగినట్టు సేవలు అందించేందుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు.

విద్యుత్ సరఫరా క్రమంలో ఎక్కడైనా ట్రిప్ అయితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చే ఎఫ్‌ఓఎంఎస్ (ఫీడర్ ఔటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ విద్యుత్ మండలి పరిధిలో 6,500 ఫీడర్లు ఉండగా 5,500 ఫీడర్ల పరిధిలో ఎఫ్‌ఓఎంఎస్ అమల్లోకి తీసుకువచ్చినట్టు అధికారులు వివ రించారు.

మిగిలిన ఫీడర్ల పరిధిలోనూ త్వరగా ఈ క్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్, వినియోగదారులకు మెరుగైన సేవలు, కార్యాల యంలో ఫైళ్ల పరిష్కారం వేగవంతం వంటి పలు అంశాల ప్రాతిపదికగా ఎస్పీడీసీఎల్ ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్ పొందడం అభినందనీయమని, రాబోయే రోజుల్లోనూ మరిన్ని మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.

విద్యుత్ సిబ్బంది కోసం రూపొందించిన ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను డిప్యూటీ సీఎం పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండీ నవీన్ మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీతో పాటు డైరెక్టర్లు, సీఈలు తదితరులు పాల్గొన్నారు.