మోదీకి రాష్ట్ర ప్రజల ప్రశ్నలివే!

10-05-2024 02:14:25 AM

ప్రధాని, బీజేపీ హామీలపై టీ కాంగ్రెస్ ట్వీట్

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం మరోసారి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గురువారం ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల ప్రశ్నలివే అంటూ ట్వీట్ చేసింది. 

కాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది..? 

2014 ఎన్నికల్లో కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి కట్టుబడి ఉందని మ్యానిఫెస్టోలో చేర్చారు. ఇందుకు కేంద్రం రూ.40 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 60 ఎకరాల భూమిని కేటాయించింది. 2016లో రైల్వే సహాయ మంత్రి మనోజ్‌సింగ్ దేశంలో ఎక్కడా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం లేదని హఠాత్తుగా ప్రకటించారు. అయితే, 2019లో మహారాష్ట్ర, 2023లో అసోం కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించారు. చివరిగా కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేసి గాలికొదిలేశారు. తెలంగాణ ప్రజలను ప్రధాని, బీజేపీ పదే పదే ఎందుకు మోసం చేస్తున్నారు? 

బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్ విషయంలో ఎందుకు విఫలమయ్యారు? 

బీజేపీ హయంలో బయ్యారం స్టీల్ ప్లాంటు, హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రణాళికలు రోడ్డున పడ్డాయి. 2014 ఏపీ విభజన చట్టం ప్రకారం ఈ రెండు హామీలు ఇచ్చారు. దీంతో తెలంగాణకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి. అయినప్పటికీ వీటిని అటకెక్కించారు. ఈ ప్రాజెక్టులను రద్దు చేసే సమయంలోనే గుజరాత్‌కు బుల్లెట్ రైల్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ వంటి భారీ ప్రాజెక్టులను ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి మీ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను మోదీ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేసింది? 

మాదిగ ఉప కోటా వాగ్దానం గాలి మాటలేనా? 

మాదిగ సబ్‌కోటా కావాలనే అంశం చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నా ఈ మధ్యే ప్రధాని పెదవి విప్పారు. వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి 5 నెలలైనా కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో కులగణనను మోదీ  నిరాకరించారు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కులగణనకు కట్టుబడి ఉంది. తెలంగాణలోని ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కులగణనపై ప్రధాని తన వైఖరిని స్పష్టం చేయగలరా? లేని పక్షంలో మాదిగ సామాజిక వర్గానికి ఉప కోటాలను ఎలా ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారు?