25 April, 2026 | 3:21 AM

సీపీఐతో స్నేహం కొనసాగిస్తాం

10-05-2024 02:12 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

సిద్దిపేట/హుస్నాబాద్, మే 9 (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)తో కాంగ్రెస్ పార్టీ స్నేహం కొనసాగిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం హుస్నాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సీపీఐ నేతల సమావేశానికి మంత్రి హజరై మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపించేందుకు సీపీఐ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఏర్పడిన మైత్రీ భవిష్యత్‌లోనూ కొనసాగుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి సీపీఐ మండల కార్యదర్శులకు సమచారం ఇస్తున్నట్లు తెలిపారు. సీపీఐ నేతలు నియోజకవర్గంలోని సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.

బీజేపీ నేతలు పైకి జైశ్రీరామ్ అంటూనే అంతర్గతంగా రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు రాజ్యాంగాన్ని మార్చే కుట్రపన్నుతున్నారని విమర్శించారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ హుస్నాబాద్‌కు చేసిన అభివృద్ది చెప్పకుండా రాముడి అక్షింతాలు వచ్చాయా, రాముడి ఫోటో వచ్చిందా అం టూ ప్రజలను మభ్యపెట్టాడం సిగ్గుచేటన్నారు. వేములవాడకు వచ్చిన మోదీ హిందూ సాంప్రదాయాన్ని పాటించలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యద ర్శి మంద పవన్, హుస్నాబాద్ కార్యదర్శి గడిపె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.