25 April, 2026 | 7:07 AM

మార్ఫింగ్ వీడియో దేశమంతా వ్యాప్తి

10-05-2024 02:14 AM

ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు  

ఢిల్లీ పోలీసులకు ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరణ 

విచారణ జూన్ 12కు వాయిదా

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్టు తయారుచేసిన ఫేక్ వీడియో తెలంగాణకే పరిమితం కాలేదని, దేశమంతా వ్యాప్తి అయ్యిందని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఈ కేసులో కీలక విషయాలను చెప్పకుండా టీపీసీసీకి చెందిన పిటిషనర్లు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందారని, వాటిని రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ జరిపారు. ఢిల్లీ పోలీసులు కోరిన మేరకు గతంలోని మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను జూన్12కి వాయిదా వేశారు. ఢిల్లీ పోలీసుల తరఫున టి సృజన్‌కుమార్‌రెడ్డి వాదిస్తూ, కేసు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వ్యాప్తి అయ్యిందని తెలిపారు. రాష్ట్రంతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, నాగలాండ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన పలువురికి సమన్లు జారీ చేసినట్టు చెప్పారు.

టీపీసీసీకి చెందిన మన్నె సతీశ్ ఇతరులు ఈ వాస్తవాలను దాచిపెట్టి, అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందారని వివరించారు. పిటిషనర్ల మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల నుంచి ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వీడియోలు వైరల్ చేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని వివరించారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పారు. అందుకే ఢిల్లీ పాటియాల కోర్టు ద్వారా టీపీసీసీకి చెందిన మన్నె సతీష్, పీ నవీన్, కోయ గీతపై నాన్ బెయిలబుల్ వారెంట్ పొందినట్టు వివరించారు. హైకోర్టు నుంచి వారు పొందిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో ఆరుణ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కీలక సమాచారం లభ్యమైందని తెలిపారు. అరుణ్‌రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారని చెప్పారు. ఇప్పటికే కోయ గీతకు చెందిన మొబైల్ సీజ్ చేశామని తెలిపారు. ఇందులో కీలక వివరాలు ఉన్నాయని వెల్లడించారు. ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు తెలంగాణకు పరిమితం కాదని, కాబట్టి ఇక్కడి కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు, ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సరవరించలేమని స్పష్టంచేసింది. తదుపరి విచారణను జూన్12కి వాయిదా వేసింది.