మోదీ ఓ కన్వర్టెడ్ బీసీ!

02-05-2024 01:52:34 AM

గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అగ్రకులస్థుడే l ప్రధాని అయినంకనే తన కులాన్ని బీసీల్లో చేర్చాడు l రిజర్వేషన్ల రద్దే ఆరెస్సెస్ మూల సిద్ధాంతం దానిని అమలు చేయాలని బీజేపీ యత్నం l భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని కుట్ర l వాజ్‌పేయి హయాంలోనే గెజిట్ విడుదల అబద్ధాల వర్సిటీకి మోదీ వీసీ.. అమిత్ షా రిజిస్ట్రార్ l ఫేక్ వీడియోతో సీఎంగా నాకేం సంబంధం? l నా ఆరోపణలకు బీజేపీ వివరణ ఇవ్వాలి మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ కానేకాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ‘కన్వర్టెడ్ బీసీ’ అని ఆరోపించారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ కులం ఉన్నత కులాల జాబితాలో (ఫార్వర్డ్ క్యాస్ట్) ఉండేదని, ప్రధానమంత్రి అయ్యాక తన సామాజికవర్గాన్ని బీసీల జాబితాలో చేర్చారని విమర్శించారు. తనకు అవసరమైప్పుడల్లా ఆయన బీసీ కార్డు వాడుకొం టున్నారని ధ్వజమెత్తారు. ఇండియాను హిందూ దేశంగా మార్చాలనే కుట్రతో రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బుధవారం జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు. మోదీ ఆర్టిఫిషి యల్ బీసీ అని విమర్శించారు.

అబద్ధాల యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్ (వీసీ) మోదీ అయితే, రిజిస్ట్రార్ అమిత్ షా అని ధ్వజమెత్తారు. బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆరెస్సెస్ మూల సిద్ధాంతమని, వాటి అమలుకు బీజేపీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. నకిలీ వీడియోలు తయారు చేయాల్సిన అవసరం సీఎంగా తనకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా. రిజర్వేషన్లపై చర్చ జరగకుండా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. రిజర్వేషన్ల రద్దుపై చర్చించినందుకే నాపై ఢిల్లీలో అక్రమ కేసులు పెట్టారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్.. తన ప్రసంగంలో రిజర్వేషన్ల రద్దు గురించి ప్రస్తావించారు. ‘నేను రిజర్వేషన్ల రద్దు గురించి వాదిస్తున్నాను.

నా వాదనలపై సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మోదీ, అమిత్‌షాలకు ఉన్నది. ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ, ఐటీ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి నేను కచ్చితంగా పోరాడుతాను’ అని రేవంత్ స్పష్టంచేశారు. తనపై ఎవరో ఫిర్యాదు చేస్తే నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటారని, అందుకే తనపై కేసులు పెట్టేందుకు వారిని ఎంచుకున్నారని విమర్శించారు. పోలీసులతో బెదిరించాలని చూస్తే అది జరగదని, అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు. సీఎంగా దళిత, గిరిజనులకు అండగా ఉంటానని, ఢిల్లీ సుల్తానులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. రిజర్వేషన్లు కాపాడుకోవడానికి సీఎం హోదాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు. 

రాజ్యాంగమంటే వాళ్లకు గిట్టదు 

రాజ్యాంగంపై సమీక్ష చేయాలని రిజర్వేషన్ల రద్దుపై 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చడానికి 10 మంది సభ్యులతో  జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారని తెలిపారు. 2002లో వెంకటాచలయ్య కమిషన్ నివేదికలో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలనేది పొందుపర్చిందని, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం బీజేపీకి లేకుండా పోయిందని చెప్పారు. ‘2015లో ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎన్‌జీ వైద్య కుల రిజర్వేషన్లను పదేండ్ల్ల తర్వాత తొలగించాలని సూచించారు. 1960లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ గోల్వాల్కర్ రాసిన పుస్తకంలో దళితులకు హక్కులు లేని హిందూ దేశం కావాలని పేర్కొన్నారు. గోల్వాల్కర్ చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్ల రద్దుకు యత్నిస్తున్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చుతామని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ప్రకటించారు’ అని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

కాంగ్రెస్ రిజర్వేషన్లు పెంచాలనుకుంటోంది 

బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు పెంచాలని చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ కావాలా? పెంచే కాంగ్రెస్ కావాలా? అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. రాజ్యాంగం మౌలిక సూత్రాలను సవరించాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలని, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే ఉపయోగపడుతుందని హెచ్చరించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే 400 ఎంపీ సీట్లలో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలు పక్కకు వెళ్లాయని, రాజ్యాంగం మార్చాలా? మార్చకూడదా? అనే అంశంపైనే చర్చ జరుగుతున్నదని అన్నారు.