మోదీ సినిమాను ట్రైలర్‌తోనే ముగించాలి

02-05-2024 01:54:52 AM

పుస్తెలతాడు విలువ ఆయనకు తెలీదేమో? 

బీవీ రాఘవులు, దానం నాగేందర్ వ్యాఖ్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (విజయక్రాంతి): దేశంలో గడిచిన పదేళ్లలో చూసిం ది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందున్నది అంటూ వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోదీకి ట్రైలర్‌తోనే ముగింపు పలకాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దానం నాగేందర్‌కు మద్దతుగా సీపీఎం సిటీ సెంట్ర ల్ కమిటీ సమావేశం గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని నగర కార్యాలయంలో బుధవారం జరిగింది. సమావేశానికి నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నరసింహరావు, పాలడు గు భాస్కర్ పాల్గొన్నారు.

బీవీ రాఘవులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు పుస్తెలతాడుని అమ్ముకుని రోడ్డుపైకి రావాల్సి వస్తోందంటూ మోదీ వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బహుశా మహిళల పుస్తెలతాడుకు ఉన్న విలువ మోదీకి తెలియదేమోనని మండిపడ్డారు. ఇప్పటిదాకా మోదీ కార్నర్ చేస్తే మనం సమాధానం చెప్పాం.. కానీ, ఇప్పుడు మనం కార్నర్ చేస్తే ఆయన సమాధానం చెప్పాల్సిన దుస్థితికి వచ్చారని చెప్పా రు. దేశంలో ఈ సారి అధికారంలోకి వచ్చే పరిస్థితి బీజేపీకి లేదన్నారు. హైదరాబాద్‌లో గుండెకాయ లాంటి సికింద్రాబాద్ పార్లమెం టు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దానం నాగేందర్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తన పాలనలో కులమతాలను రెచ్చగొడుతూ ప్రజల్లో విధ్వేషాలను పెంచుతోందన్నారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తారని భావిస్తే, నోట్ల రద్దు పేరుతో ప్రజలను వీధిపాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కులగణన జరుగుతుందన్నారు. సీపీఎం పార్టీ ఉద్యమ స్ఫూర్తితో పార్లమెంటులో ప్రజల గళం వినిపిస్తానని చెప్పారు.