05-12-2025 01:31:16 AM
ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్లు, షిఫ్టింగ్, గుర్తింపునకు లక్షల్లో తడుపుడే!
సర్టిఫికెట్లు లేవని కొర్రీలు.. ముడుపులిస్తేనే అనుమతులు
ఫైన్ల బాగోతం సరేసరి!
* ఇంటర్ బోర్డులోని పలువురు అధికారులకు ‘ప్రైవేట్’ పంట పండుతోంది. ప్రైవేట్ జూనియర్ కాలేజీల సమస్యలు ఏవైనా.. పరిష్కరించాలంటే కాసులు కుమ్మరించాల్సిందే మరి. ప్రైవేట్ కాలేజీలకు అఫిలియేషన్ (గుర్తింపు), షిఫ్టింగ్‌కు తొలుత నిబంధనలు పాటించాలంటారు. ఆ తర్వాత ఆ నిబంధనలను బోర్డు అధికారులే తుంగలో తొక్కేస్తున్నారు. అడిగింది ఇస్తే రూల్స్ అన్నీ పక్కనబెట్టి అనుమతులిచ్చేస్తారు.
అఫిలియేషన్, కాలేజీల షిఫ్టింగ్‌కు దరఖాస్తులు వస్తే అధికారులకు పండగే. ఆ పనులు పూర్తిచేసి అధికారులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు అనుమతుల పేరుతో దోపిడీ, మరోవైపు ఫెనాల్టీల పేరుతో జరిమానాలు విధించి ప్రైవేట్ కాలేజీలపై భారం మోపుతున్నారని పలు కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): విద్యాసంవత్సరం మొదలైందంటే చాలు.. డీఐఈవో (డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్)లు ఆడిందే ఆట, పాడిందే పాట. జిల్లాల్లోని జూనియర్ కాలేజీలపై పెత్తనం వారిదే. అనుమతులు, తనిఖీల్లో వారి పర్యవేక్షణ ఉంటుం ది. ఇదే వారికి కాసులు కురిపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు నిబంధనలు ప్రైవేట్ కాలేజీలకు శాపంగా మారితే, డీఐఈవోలకు మాత్రం కాసుల వర్షం కురుపిస్తున్నాయనే ఆరోప ణలున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో అఫిలియేషన్ కోసం ఇంటర్ బోర్డుకు జూనియర్ కాలేజీలు దరఖా స్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కాలేజీల నిర్వహణకు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు రావాలంటే ఆ కళాశాల భవన రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజు డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్, శానిటరీ సర్టిఫికెట్‌లతోపాటు బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అన్నిరకాల అనుమతులు వివిధ శాఖల నుంచి తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడుగానీ ఆయా కాలేజీలకు ఆ విద్యాసంవత్సరం అడ్మిషన్లు చేపట్టడానికి ఇంటర్ బోర్డు అధికారులు గుర్తింపు ఇవ్వరు.
సరిగ్గా ఈ నిబంధనలే కొంత మంది డీఈవోలకు వరంగా మారాయి. దరఖాస్తుతోపాటు సమర్పించాల్సిన ధ్రువపత్రాల్లో కీలకమైనవి ఫైర్ ఎన్‌వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, శానిటరీ సర్టిఫికెట్‌లు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 1,460 ప్రైవేట్ కాలేజీలు అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. అక్టోబర్ వరకు 1,368 కాలేజీలకు గుర్తింపు ఇచ్చేశారు. ఇంకా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న కాలేజీలు పదుల సంఖ్యలోనే ఉంటాయి. మొత్తం కాలేజీల్లో 200 వరకు ప్రైవేట్ కాలేజీలు గృహ, వాణిజ్య సముదాయా(మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ)లో నడుస్తున్నాయి.
6-15 మీటర్లలోపు ఎత్తున్న భవనాలైతే అవసరమైన అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. 15 మీటర్ల కంటే మించితే అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ జారీచేయాలి.ఈ తరహా కాలేజీలు 90 శాతం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అయితే ఇటువంటి కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలంటే అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ లేకపోవడంతో కొన్ని కాలేజీల దరఖాస్తులను ఇంటర్ బోర్డు అధికారులు తిరస్కరిస్తున్నారు.
ఈ తరహా కాలేజీల అనుమతులకు సంబంధించిన ఫైళ్లు ఇటు ఇంటర్ బోర్డులో, అటు సచివాలయంలో ఇంకా పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటికి అనుమతులివ్వాలంటే పలువురు అధికారులు రూ.లక్షల్లో అమ్యా మ్యాలు అడుగుతున్నట్లు ఓ కళాశాల యజమాని తెలిపారు. దీంతోపాటు అనుకోని పరిస్థితుల్లో కాలేజీ భవన యజమానితో మనస్పర్ధలు వచ్చి నిర్ధాక్షిణ్యం గా రెంటల్ కాలేజీ బిల్డింగ్‌ను యాజమాన్యాలు ఖాళీచేయాల్సి వస్తోంది.
ఈ క్రమంలో వేరే మండలంలో ఆ కాలేజీను షిఫ్ట్ చేయాలంటే ప్రైవేట్ కాలేజీల యా జమాన్యాలకు తలనొప్పిగా మారింది. అధికారులు అనుమతులివ్వకపోగా వారు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక వారు ఎంతోకొంత ఇస్తే తీసుకోకపోగా పలువురు డీఐఈవోలు కాలేజీల యాజమాన్యాలతో బేరసారాలు ఆడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
కాలేజీలపై ఫెనాల్టీల భారం..
ఇంటర్ బోర్డు విధించే ఫెనాల్టీలతో చిన్నా చితక ప్రైవేట్ కాలేజీలు కుదేలు అయ్యే పరిస్థితి ఉంది. ఆర్థికభారం తడిచి మోపెడవుతున్నది. ఎన్‌వోసీ, శానిటరీ తదితర సర్టిఫికెట్ల కోసం సంబంధిత శాఖలకు దరఖాస్తు చేసుకుని, ఆ సర్టిఫికెట్ జారీ అయ్యే క్రమంలో జాప్యమవుతోంది. దీంతో అఫిలియేషన్, షిఫ్టింగ్, పరీక్ష ఫీజు పేర్లతో ఇష్టానుసారంగా ఫెనాల్టీలను విధిస్తున్నారని పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
అఫిలియేషన్‌కు రూ. లక్ష, అనాథరైజ్డ్ షిప్టింగ్‌కు రూ. 5 లక్షల నుంచి ఆపైన లేట్ ఫీజును విధిస్తున్నారు. ఇవి చెల్లించినా.. అధికారులకు అనధికారికంగా ‘ఫీజులు’ చెల్లించుకోవాల్సిందే. కాలేజీల షిఫ్టింగ్‌కు కూడా రూ. లక్ష నుంచి లక్షన్నర ముడుపులు అడుగుతున్నట్లు సమాచారం. ఇక ఎన్‌వోసీ జారీకి అంతకుమించి రెండు రెట్లు అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇది ఇంటర్ బోర్డు స్థాయిలో మాత్రమే.
ఇక సచివాలయం స్థాయిలో అయితే అఫిలియేషన్, ఎన్‌వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, షిష్టింగ్‌కు కోసం భారీస్థాయిలో ముడుపులు ముట్టజెప్పాల్సి వస్తోందని ఆరోపణలున్నాయి. సర్టిఫికెట్లు లేవని దరఖాస్తును రిజక్ట్ చేసిన అధికారులు, ఫెనాల్టీలు ఎందుకు వేస్తున్నారని పలు కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా ఏమైనా దరఖాస్తుల కోసం సంబంధిత శాఖకు అర్జీ పెట్టుకుంటే, ఆ సర్టిఫికెట్ వచ్చేలోపు ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగుస్తోంది.
ఆతర్వాత ఫెనాల్టీతో విద్యార్థుల ఫీజును కాలేజీలు భరించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక కాలేజీలో 500 మంది విద్యార్థులుంటే.. ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున లేట్ ఫీజు కట్టాలన్నా రూ. 2.50 లక్షలు అవుతోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటే ఇది ఇంకా ఎక్కువనే. ఇలా ఇష్టానుసారంగా అనుమతుల పేరుతో వసూళ్లు, ఫెనాల్టీలను విధించడం ద్వారా ఆర్థికంగా చితికిపోవాల్సి వస్తున్నదని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.