మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ షురూ
- ప్రమాదాల నివారణకు జలమండలి ముందస్తు చర్యలు
- మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు
- అందుబాటులో ఎయిర్‌టెక్ మిషన్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): నగరంలో మ్యాన్‌హోళ్లను తెరవడం వల్ల వర్షాకాలంలో జరిగే ప్రమాదాల నివారణకు జలమండలి ముందస్తు చర్యలు చేపడుతోంది. మ్యాన్‌హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. నగరంలోని డీప్(లోతైన) మ్యాన్‌హోళ్లతో పాటు 25 వేల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ను బిగించారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి వాటికి ఎరుపు రంగును వేశారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా నగరంలో అనుసరించాల్సి విధానా లపై ఇప్పటికే జలమండలి వర్షాకాల ప్రణాళికను సిద్ధం చేసింది. ఎటువంటి ప్రమా దాలు జరగకుండా జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో పని చేస్తోంది. పలుచోట్ల హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేస్తోంది.
మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులు
వర్షాకాలం ఆరంభంలోనే చిన్న వర్షానికే నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. కాలనీలు, రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో తెలిసో, తెలియకో పలువురు మ్యాన్‌హోల్స్‌ను తెరుస్తున్నారు. ఆ కారణంగా మ్యాన్‌హోల్స్‌ను తెరిచినట్లు గమనించని వారు ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. అయితే, మ్యాన్‌హోల్స్‌ను తెరిస్తే కఠిన చర్యలు తప్పవని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే సూచనలు చేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూతలు తెరిచినా, తొలగించినా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. జరిమానాతో పాటు జైలు శిక్ష వేసే అవకాశం కూడా ఉంది.
ముందు జాగ్రత్త చర్యలు
మ్యాన్‌హోల్స్‌లోని సిల్ట్ (వ్యర్థాల)ను ఎప్పటికప్పుడు తొలగించడానికి ఎయిర్‌టెక్ మిషన్లు, ఇతర వాహనాలను జలమండలి అధికారులు అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన వాటర్ మోటార్ ఉంటుంది. దీని సాయంతో వర్షం నీటిని తొలగిస్తారు. నీళ్లు అధికంగా నిలిచే చోట దృష్టి సారిస్తారు. మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి ఓక సీవరేజీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని పర్యవేక్షించి, చోకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంది.
ప్రజలకు అవగాహన
పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణనిస్తోంది. పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే చేయాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తోంది. సీవరేజీ నిర్వహనలో ప్రజలు ఎలా సహకరించాల నే అంశాలపై జలమండలి ప్రచారం చేస్తోంది. కాలనీల కమిటీలు, స్వయం సహాయక బృందాల సభ్యులతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతే కాకుండా చేయాల్సిన, చేయకూడని పనులపై సూచనలు చేస్తోంది.






