25 June, 2026 | 9:26 AM

సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చినా జాప్యమెందుకు?

14-06-2024 01:29 AM

రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడి నియామకంపై హైకోర్టు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టత ఇప్పినప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్రాన్ని హైకోర్టు నిలదీసింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తికి పరీక్ష అవసరంలేదని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. అధ్యక్షుడి నియామకంపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడి పోస్టును భర్తీ చేయకపోవడాన్ని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బగ్లేకర్ ఆకాష్ కుమార్ సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిల్‌ను ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది.

గత ఏడాది ఫిబ్రవరి 4న అధ్యక్షుడిగా ఉన్న జస్టిస్ ఎంఎస్ కే జైశ్వాల్ పదవీ విరమణ చేశారని, అప్పటి నుంచి పోస్టు ఖాళీగానే ఉందని పిటిషనర్ లాయర్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లా వినియోగదారుల కమిషన్లు ఇచ్చే తీర్పులు ఉత్తర్వులపై రాష్ట్ర కమిషన్ అప్పీలెట్ అథారిటీ అని, రూ 50 లక్షల విలువకు పైబడిన కేసులను రాష్ట్ర కమిషన్ విచారణ చేయాలని చెప్పారు. సగటున 1000 అప్పీళ్లు, 1500 రివిజన్ పిటిషన్లు, నేరుగా 400 దాకా ఫిర్యాదులు దాఖలు అవుతాయని, వాటిని విచారించే దిక్కు లేకుండా పోయిందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వ్యక్తి పరీక్ష నిమిత్తం కార్యదర్శి ముందు హాజరుకావాల్సి ఉంటుందని, ఈ కారణంగా అధ్యక్ష పదవి చేపట్టేవారికి పరీక్ష అవసరంలేదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వం తీవ్ర ఉదాసీనతతో ఉందని వ్యాఖ్యానించింది. విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.