నిరంతరాయంగా మెట్రో సేవలు
వర్షాలు, ఈదురుగాలులకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు
వర్షాకాల ప్రణాళికపై సమీక్షించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): వర్షాకాలంలో నిరంతరాయం గా మెట్రో సేవలు అందించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. గురువారం రసూల్‌పురలోని మెట్రో రైలు భవన్‌లో ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీడీ రెడ్డి, ఆపరేషన్స్, మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్ ఎండీ ఎస్‌సీ మిశ్రా, హైదరాబాద్ మెట్రో రైల్ సీనియర్ ఇంజినీర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
వర్షాకాలంలో అనుసరించాల్సిన పద్ధతులపై వారితో చర్చిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల మెట్రో సేవలకు అంతరాయం కలగకుండా ట్రాన్స్‌కో ఫీడర్ ట్రిప్ అయినట్లుతై తక్షణమే ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మెట్రో వయాడక్ట్ పక్కన మొలిచే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షం కారణంగా ప్లాట్‌ఫామ్‌లపై నీరు నిలిచిపోకుండా అదనపు హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.






