డబ్బింగ్ కావాలా రాజా! ?
ఇడుపు కాయితం సినిమాపై ట్రోలింగ్స్‌కు మనోళ్ల కౌంటర్లు
- ‘బుల్లోడు’, ‘టెన్నీసు బంతుల పాప’ను భరించాం కదా!
- దశాబ్దాలుగా వస్తున్న రాతల్ని వెక్కిరించామా?
- ప్రాంతాల వారీగా పలుకులూ మారతాయంటూ.. ఆంధ్రావాలాల వెటకారంపై తెలంగాణవాదుల ప్రతిస్పందన
పుష్కర కాలం క్రితం ‘ఇడుపు కాయితం’ ఇచ్చినా ఇక్కడి భాష, యాసను అవమానించడం కొందరు మానలేకపోతున్నారంటూ ఇప్పుడు ఆవేదన చెందుతున్న తెలంగాణ గుండెలెన్నో! తెలంగాణ మాండలికాన్ని వెక్కిరిస్తూ కొందరు వెటకారాలు నూరడమే ఇందుకు కారణం.
గత కొన్నేండ్లుగా తెలంగాణ నేపథ్య కథలు పెరగడంతో ఇక్కడి పదాలు, యాస, స్థానిక సంస్కృతిని నేరుగా టైటిల్స్‌లో ఉపయోగించే ధోరణి బలపడుతోంది. ఈ క్రమంలోనే ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా ‘ఇడుపు కాయితం’ సినిమా ప్రారంభమైంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 26న హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో సినిమా అధికారికంగా ప్రారంభమైంది.
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ముఖ్యఅతిథిగా విడుదలై, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. విడాకులకు అచ్చమైన తెలంగాణ పదంతో రూపుదిద్దుకున్న ఈ టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్ వచ్చింది. అప్పట్నుంచి ఆంధ్రా ఆకతాయి మూకలు విషం చిమ్మడం మొదలుపెట్టారు. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్‌లో ఈ టైటిల్‌పై ట్రోలింగ్స్‌కు తెర తీశారు.
వెటకారంగా పోస్టులు, మీమ్స్ పెడుతూ భాషావిద్వేషాన్ని రెచ్చగొట్టారు. అచ్చమైన తెలంగాణ పదంతో ఓ సినిమాను ప్రకటించడంతో ‘సార్.. తెలుగు భాషలో డబ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడా లా? సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్లం’ అని ఒకరంటే, ‘ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా?’ అని మరొకరు, ‘తెలంగాణలో మాత్రమే రిలీజ్ చేసుకోండి సార్, మీ భాష ఏంటో మీ యాస ఏంటో’ అంటూ నిట్టూరుస్తూ పోస్టులు పెట్టారు.
వెటకారంపై కౌంటర్ల కారం..
ఆంధ్రావాలాల వెటకారపు కామెంట్లపై తెలంగాణ నెటిజన్లు తమదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. ఒక్క ఈ సినిమా టైటిల్‌పైనే కాదు, గత పన్నెండేండ్లుగా తెలంగాణ యాసలో వస్తున్న సినిమాలపై, జానపద గీతాలపై ఇలాంటి విద్వేషపు రాతలు రాయడం వాళ్లకు అలవాటుగా మారిందని తెలంగాణకు చెందిన పలువురు రచయితలు, సినీ ప్రముఖులు, నెటిజన్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వెటకారపు పలుకులపై కౌంటర్ల కారం జల్లుతూ తెలంగాణ తెగువ చూపుతున్నారు.
‘నువ్వు డబ్బింగ్ అని ఎగతాళి చేస్తున్న ఆ మాటలు కాకతీయుల కాలం కంటే ముందు నుంచే ఈ నేల గుండెల్లో మోగుతున్న మాతృభాష. ఈ మాటలే ఉద్యమాలకు ఊపిరై, పోరాటాలకు నినాదాలై నిలిచాయి. మా భాష, యాసపై మీ దాడిని భరించలేకే కదా ఉమ్మడి ఏపీకి 12 ఏళ్ల కిందటే మేం ‘ఇడుపు కాయితం’ ఇచ్చింది. మా రాష్ట్రాన్ని, భాషను కించపరిస్తే మౌనంగా ఉండం అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇరవై ఏండ్ల క్రితం ‘మావిడాకులు’ అనే సినిమా వచ్చినప్పుడు తెలంగాణ వాళ్లు ‘డబ్బింగ్ ఉంటుందా? అని అడగలేదు.
అందరినీ తెలుగువాళ్లుగా గౌరవించడమే తెలంగాణనైజం అని గుర్తు చేస్తున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి దీనిపై ఎక్స్‌లో స్పందించారు. “ఇడుపు కాయితం’ పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని! విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి ‘విడాకులు’లో ఏముందిరా.. ఆకులా? అర్థం కాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు, చూడకండి” అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఈ వివాదంపై స్పందించిన వారిలో నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఉన్నారు. ఆయన తెలంగాణ కథలను తెలంగాణ భాషలోనే చెబుతామని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అలాగే ‘ఇడుపు కాయితం’ చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. టైటిల్ మార్చే ప్రసక్తే లేదని, దర్శకుడు తన కథకు తగినట్టే ఈ పేరు పెట్టాడని, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల టైటిల్ మారదని స్పష్టం చేశారు.
ఆంధ్ర పదాలను అర్థం చేసుకున్న తెలంగాణ..
ఒక ప్రాంతానికి చెందిన మాండలికంలో సినిమా టైటిల్స్ రావడం ఇదే మొదటిసారేం కాదు. తెలుగు సినిమాల్లో ప్రాంతీయ యాసలు, మాండలికాలు టైటిల్స్‌తో ఇంతకుముందే కనిపించాయి. ఉత్తరాంధ్ర మాండలికంలో పలాస 1978, సిప్పడ (స్థానిక పదం ఆధారంగా వచ్చిన చిన్న చిత్రం) వంటి టైటిల్స్ సినిమాలు వచ్చాయి. అల్లరి బుల్లో డు, కాశ్మీరు బుల్లోడు వంటి టైటిల్స్‌తో సినిమాలు వచ్చాయి. ‘టెన్నీ సు బంతుల పాప’, ‘బత్తాయిలు’, ‘సరుకు సామాను’ అంటూ మహామహులుగా కీర్తించబడిన గీత రచయితలు రాసిన పదాలు బోలెడు. అయి నా ఆ సినిమాలను, సాహిత్యాన్ని తెలంగాణ సమాజం సాదరంగా స్వాగతించింది.
భాష, యాసపై కనీస సోయి ఉండాల్సిందే..
ఏదేమైనా తాజా చర్చను బట్టి తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఏ ప్రాంతం వారైనా భాష, యాసలపై కనీస సోయి కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భాష అనేది ప్రాంతాలను కలిపే వారధి. ప్రాంతాలను బట్టి అది మారుతూ ఉంటుంది. తెలంగాణలోనే ఓ ప్రాంతంలో ‘సిబ్బి’ అని వినిపించే మాట.. 50 కిలోమీటర్ల దూరంలో ‘అంచె’గా మారుతోంది. దీన్ని తట్ట అని, బుట్ట అని ప్రాంతాల వారీగా పిలుస్తారు. అవగాహన తెచ్చుకొని, నేర్చుకొని గౌరవించుకునే తత్వం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఇలా విషం.. చిమ్ముతూ విద్వేషాలు రగిలించడం సరికాదు.






