calender_icon.png 15 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి బాటలో భూ భారతి!

15-01-2026 02:15:25 AM

రిజిస్ట్రేషన్ల ఫీజు చెల్లింపుల్లో భారీ కుంభకోణం 

నోటీసులతో రైతులు లబోదిబో

మహబూబాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): ధరణిలో అనేక అవకతవ కలు జరిగాయని, తాము అధికారంలోకి రాగానే దానిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి, ధరణికి బదులు పటిష్ట మైన భూభారతి చట్టాన్ని తెస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ధరణికి బదులుగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఇటీవల బయటపడ్డ రిజిస్ట్రేషన్ల ఫీజు చెల్లింపులో జరిగిన భారీ కుంభకోణం ధరణి బాటలోనే భూభారతి కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

భూ భారతి ‘పాత సీసాలో కొత్త సారా’గా మా రిందే తప్ప పెద్దగా మార్పులేమీ లేవనే విమర్శలు వచ్చాయి. తాజాగా యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో  భూ భారతి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న డొల్లతనాన్ని ఆసరాగా చేసుకొని 100 శాతం చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజును కేవలం ఒక్క శాతం మాత్రమే చెల్లించి 99% డబ్బులు అంటే కోట్ల రూపాయలమేర ఆన్‌లైన్ సెంటర్, మీసేవ నిర్వాహకులు దిగమింగిన ఘటనలు కలకలం సృష్టించాయి. 

తహసీల్దార్లకు తలనొప్పిగా..

వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ఆఫీసులకు తోడు గా తహసీల్దార్ కార్యాలయాల్లో జాయిం ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించింది. తహసీల్దార్లకు జాయిం ట్ రిజిస్ట్రార్ అధికారాలను కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలోనే ఆయా మండ లాల పరిధిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి చర్యలు తీసుకుంది.

దీనితో తహసీల్దార్లు తమకు అదనపు భారంగా రిజిస్ట్రేషన్ల వ్యవహారం మారిందని, అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదించారు. దీనితో రెండేళ్ల తర్వాత కేవలం వ్యవసాయ భూములను మాత్రమే తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా, మిగిలిన వాణిజ్య వ్యవసాయేతర భూముల ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను యథావిధిగా సబ్ రిజిస్టార్ కార్యాల యాల్లో చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై సరైన ఆజమాయిషి కరువైంది. రిజి స్ట్రేషన్ల శాఖ వ్యవసాయ భూముల వ్యవహారాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. 

పగడ్బందీగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు..

వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలకు వ్యవసాయేతర భూములు అనగా ఓపె న్ ప్లాట్లు, అంతస్తులు మొదలగు వాణిజ్య భూములు, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లకు అనుసరిస్తున్న విధానాన్ని భూభారతిలో అమ లు చేయకపోవడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సరైన పర్యవేక్షణ, నిఘా, ఆడిట్ లేకపోవడమే అక్రమార్కులకు ఉతంగా మారింది. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహా రాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ పగడ్బందీగా నిర్వహిస్తోంది. కాగా పూర్తిగా వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రతి రెవెన్యూ అంశం సీసీఎల్‌ఏ (భూపరిపాలనా ప్రధాన కమీనర్) పరిధి లో ఉండడంతో, రిజిస్ట్రేషన్ల వ్యవహారం కూడా ఈ శాఖకే గత ప్రభుత్వం అప్పగించింది.

వ్యవసాయేతర భూములు సంబంధించి ప్రతి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌ను, చెల్లించాల్సిన ఫీజును సంబంధిత రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్ ఆపరేటర్ మొదలుకొని సబ్ రిజిస్ట్రార్ వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లో పొరపా ట్లు లేకుండా, ఫీజు చెల్లింపులో ఒక్క రూపాయి కూడా తక్కువైనా సదరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేస్తారు. ఇందుకు సంబంధించి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో చాలాన్ ‘డీఫేస్’ ఆప్షన్ ను పకడ్బందీగా సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. కంప్యూటర్ స్క్రీన్‌లో ఎడమవైపున సదరు దస్తావేజు విలువ ప్రకా రం చెల్లించాల్సిన రుసుము, కుడివైపున వినియోగదారుడు దస్తావేజు రిజిస్ట్రేషన్ నిమిత్తం చెల్లించిన ఛాలన్ కు సంబంధించి వివరాలు కనిపిస్తాయి.

ఉద్యోగి రెండింటిని జాగ్రత్తగా పరిశీలించిన అన్ని సక్రమంగా ఉంటే ఛాలన్ ఆక్సెప్ట్ చేస్తారు. దీనితో అవతవకలకు పాల్పడే అవకాశం ఉండదు. వాటితో పాటుగా రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని ప్రతినెల జిల్లా రిజిస్టార్ కార్యాలయం నుంచి, అలాగే ప్రతి మూడు నెలలకు ఓసారి రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజి ఆధ్వర్యం లో పరిశీలన చేయడం జరుగుతుంది. దీనికి తోడు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫీజు చెల్లింపుల వ్యవహారాన్ని ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహిం చడంతో పాటుగా వారికి సందేహం వచ్చిన ఆస్తులను, ప్లాట్లను క్షేత్ర స్థాయిలో వెళ్లి విచారణ చేపడుతారు. దస్తావేజులో చూపిన విధం గా కాకుండా ఇతర నిర్మాణాలు ఉంటే వాటికి అదనంగా స్టాంపు రుసుమును వినియోగదారుల నుంచి వసూలుచేస్తారు.

ఈ విధంగా అడుగడుగునా వ్యవసాయేతర, వాణిజ్య భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని పరిశీలిస్తుండడంతో ఫీజు చెల్లింపు వ్యవహారంలో పెద్దగా ఎక్కడకూడా అవకతవకలు జరగడం లేదని చెబుతున్నారు. అయితే ఈ విధానాన్ని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లకు పటిష్టంగా అమలు చేయకపోవడం, తహసిల్దార్ కార్యాలయంలో ప్రతి డాక్యుమెంటును క్షుణ్ణంగా తనిఖీ చేసుకునే సమయం లేకపోవడం, ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించ కపోవడం వల్ల కొందరు అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ల ఫీజును కొల్లగొట్టడానికి అణువుగా మారిందని విమర్శలు వస్తున్నాయి.

ఆడిట్ లేకపోవడంతోనే..

తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని పర్యవేక్షించడం, జరిగిన లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించ కపోవడంతో కొద్ది సమయంలోనే కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి అవకాశంగా మారింద ని చెబుతున్నారు. వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుగా ఆన్లైన్ సెంటర్, మీసేవ కేంద్రం ద్వారా రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వేయించి, ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత నగదు చెల్లింపు సక్రమంగా జరిగిందా లేదా అనే అంశాన్ని పరిశీలించడానికి తహసిల్దార్లకు అనువైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ అందుబాటులో లేకపోవడం, కేవలం ‘ట్రాన్సాక్షన్ సక్సెస్ ఫుల్ ’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం వల్ల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడడానికి కారణమైందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహా రంలో కీలక పాత్ర వహించిన ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారని, ఇందులో మరింత మంది ప్రమేయం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. భూభారతి అమలులో ఉన్న లొసుగులను గుర్తించడానికి రాష్ట్రస్థాయిలో హై లెవెల్ కమి టీ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌లోనే ప్రధాన సమస్య..

తెలంగాణ ప్రభుత్వం మొదటగా ధరణి భూ రికార్డుల కంప్యూరీకరణ ప్రవేశపెట్టినపుడు సాఫ్ట్ వేర్ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అప్పట్లో ఆ సంస్థపై అనేక విమర్శలు వచ్చినా,  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఈ సంస్థనే తమ బాధ్యతలను నెరవేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిలో లోపాలను సరిచేస్తూ నూతనంగా భూభారతిని ప్రవేశపెడుతూ ఆ బాధ్యతలను ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మటిక్స్ కు అప్పగించింది. అయితే ఈ సంస్థ సాఫ్ట్ వేర్ లో లోపాలను సరిచేయక పోవడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

భూభారతిలో మొదటగా స్లాట్ బుక్ చేసుకోవడానికి వినియోగదారుడు వెబ్ సైట్ ద్వారా లాగిన్ కావలసి ఉంటుంది. అనంతరం భూమి రిజిస్ట్రేషన్ చేయు విధానం అనగా కొనుగోలు లేదా బహుమానం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోదలచిన సర్వే నెంబరును ఎంచుకోగానే అందుకు సంబంధించిన మార్కెట్ విలువ కనిపిస్తుంది. ఈ విలువ ఎక్కువగా చేసుకునేందుకు వీలుంది కానీ తక్కువ చేయడానికి వీలులేదు. అమ్మకందారు, కొనుగోలుదారు వివరాలు అన్ని నమోదుచేశాక ట్రాన్సాక్షన్ సమ్మరీ కనిపిస్తుంది. దీనిలో పార్టీల వివరాలు, భూమి వివరాలు, చెల్లించవలసిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము, మ్యూటేషన్ ఫీజు తదితర వివరాలు కనిపిస్తాయి.

తర్వాత సదరు స్టాంపు డ్యూటీ చెల్లించేందుకు వినియోగదారుడు ఎంచుకున్న పేమెంట్ విధానం ద్వారా భూభారతి వెబ్ సైట్ నుండి ఎంచుకున్న పేమెంట్ గేట్ వే ద్వారా బ్యాంకు వెబ్ సైట్ కు సంధానించబడుతుంది. ఈ సమయంలో భూభారతి లో ఛాలన్ నెంబరు జనరేట్ అవుతుంది. ఈ ఛాలన్ నెంబరు ద్వారానే తహశీల్దారు ఛాలన్ ‘ఢీపేస్’ చేయడానికి వీలవుతుంది. ఇక్కడే చెల్లించవలసిన మొత్తాన్ని వివిధ అనైతిక మార్గాల ద్వారా ఎడిట్ చేసి ఎక్కువ మొత్తంలో ఉన్న ఛాలన్ తక్కువ మొత్తంలో చెల్లిస్తారు.

బ్యాంకు వైపు ఛాలన్ చెల్లింపు విజయవంతం అయిన తర్వాత మరల ఆ పేజి భూభారతి వెబ్ సైట్ కు రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడే లోపం ఉండటంతో వినియోగదారుడు చెల్లించిన మొత్తం, చెల్లించాల్సిన మొత్తాన్ని పోల్చి చూసే వీలుగా సాంకేతిక లేకపోవడంతోనే చాలాన్ డబ్బులు దిగమింగడానికి అనుకూలంగా మారిందని చెబుతున్నారు. 

కాగా చెల్లింపు చేయకముందు జనరేట్ అయిన ట్రాన్సాక్షన్ విజయవంతం అయితే సరిపోతుంది. తహశీల్దారు లాగిన్‌లో కూడా వ్యవసాయేతర భూములలో చాలాన్ తనిఖీ చేసే విధంగా ఎవటుంటి విధానం లేకపోవ డం, పని ఒత్తిడిలో తహశీల్దార్లు భూభారతి ఆపరేటర్లపైననే ఆధారపడటం ఈ తతంగానికి ఊతంగా మారిందని, కొన్ని చోట్ల బాధ్యతగా వ్యవహరించవలసిన అధికారులు తమకు అదనపు భారంగా ఈ విధానాన్ని భావించడంతో దాటవేత ధోరణిలో పనిచేస్తుండగా అజమాయిషీ లోపించినట్లు పలువురు తమ అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. 

రైతులకు నోటీసులు

భూభారతి ద్వారా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటనల నేపథ్యంలో తక్కువ చలాన్ జనరేట్ అయిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రైతులకు నల్లగొండ, జనగామ జిల్లాలో తహసీల్దార్లు మిగిలిన సొమ్ము చెల్లించి డాక్యుమెంటును రెగ్యులర్ చేసుకోవాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ రెండు జిల్లాల్లో అనేక మంది రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీచేయడంతో రైతులు లబోదిబో అంటున్నారు. తాము చేయని తప్పుకు తమను బలి పశువులను చేయడం తగదని, తప్పు ఎక్కడ జరిగిందో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని, తాము ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లో చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వ్యాల్యూ ప్రకారం డబ్బులు చెల్లించామని, ఇప్పుడు మేము తక్కువగా చెల్లించామంటూ, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు ఇవ్వడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాత పద్ధతిలోనే మేలు..

ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షణ అధికారాలను కలిగి ఉంటుంది. ఈ విధానానికి సంబంధించి డీఐజీ స్థాయి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి వర కు పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఆ స్థాయిలోనే పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయితే తహశీల్దార్లు మాత్రం ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కేవలం డిజిటల్ సంతకం చేయడం వరకు మాత్రమే తమ విధి అన్నట్లుగా వ్యవహరిస్తుండటం కూడా ఈ తరహా మోసాలకు తావిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయే తర, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే నిర్వహిస్తూ సబ్ రిజిస్ట్రార్లకు పాత పద్ధతిలోనే వీలు కల్పిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రైతులను బాధ్యులను చేయడం సరికాదు

రిజిస్ట్రేషన్ డబ్బులు మొత్తం చెల్లించి భూములు రిజిస్ట్రేషన్ చేసుకు న్న రైతులకు నోటీసులు ఇవ్వడం సరికాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి దారి మళ్లీ నిధులను వారి నుంచి రికవరీ చేసి జమ చేసుకోవాలి. చేయని తప్పుకు రైతులను బాధ్యులను చేయడం సరైనది కాదు. తప్పు చేసిన వారిని వదిలేసేందుకే రైతులను బలి పశువులను చేయడానికి నోటీసులు జారీచేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ధరణి సరిగాలేదని ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది. ఇందులో కూడా అవకతవకలు చోటు చేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. భూ భారతి కూడా డొల్లగా మారింది. వెంటనే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన ఆన్లైన్, మీసేవ కేంద్ర నిర్వాహకులతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలి.

 యాసారపు కరుణాకర్,

రైతు, చౌడారం, జనగామ జిల్లా