19-10-2025 12:34:32 AM
కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి
చూట్టూ ఎత్తున కొండలు, పచ్చని వృక్షాలు, ఆలయ ముందు గలగలా పారే వాగు, కొండలపైనుంచి ఎక్కడపడితే అక్కడ కనిపించే అందమైన జారే జలపాతాలు.. వాగులు, వంకలు, ప్రకృతి సహజసిద్ధమైన అందాలను ఒలకపోస్తాయి. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదరకరమైన దృశ్యాలకు ఆలవాలుగా నిలచిందే.. భక్తు లను ఆ దృశ్యాలు కట్టిపాడేస్తాయి. అక్కడే శతాబ్దాల క్రితం వెలసిన ‘గుబ్బలమంగమ్మ తల్లి’ ఆలయంలో కొలువైన ఉన్న అమ్మవారు.. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధికెక్కింది.
తెలంగాణ ఆంధ్రా సరిహద్దులో దట్టమైన అటవీప్రాంతంలో శతాబ్దాల క్రితం వెలిసిన గుబ్బలమంగమ్మ తల్లి ఈ ప్రాంతభక్తులకు ఆరాధ్యదైనం. రహదారులు సరిగాలేనప్పుడు కూడ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, సైకిళ్లు, కాలినడకన వేలాదిమంది భక్తులు అడవులగుండా వెళ్లి అమ్మవారిని దర్శించుకునేవారు. బ్రిటీష్ వారి పాలనసమయంలోనే అమ్మవారు ఆ ప్రాంత జమీందారుకు కనపడటంతో అప్పటినుంచి వెలుగులోకివచ్చారు.
భక్తుల కొంగుబంగారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నుంచి 35 కిలోమీటరు దూరంలో దట్టమైన ఆటవీ ప్రాంతంలో కొత్తకన్నాయిగూడెం మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం అశ్వారావుపేట నుంచి- ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి బీటీ రహదారి సౌకర్యం ఉంది. సమీపంలోని పందిరిమామిడిగూడెం వరకు బస్ సౌకర్యం కూడా ఉంది. బీటీ రహదారినుంచి సుమారు 5 కి.మీ. మేర పూర్తిగా అడవిగుండా మట్టి రోడ్డులో అమ్మవారి వద్దకు ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో కొండలు, వాగులు కనిపిస్తాయి.
ఈ ఆలయానికి తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలోని పలు జిల్లాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గుబ్బలమంగమ్మ భక్తుల కోరిన కోర్కెలను తప్పక తీరుస్తుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. ప్రతి ఆది, గురువారాల్లో ఆలయానికి వేలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. మేకలు, కోళ్లు వంటివాటిని అమ్మవారికి సమర్పించి, అక్కడే వంటలు చేసుకొని బంధుమిత్రులతో కలసి సహపంక్తి భోజనాలు చేస్తారు. సాయంత్రం వరకు ఆలయ పరిసరాల్లోనే గడుపుతారు.
కలగానే అభివృద్ధి..
గుబ్బల మంగమ్మ ఆలయ పరిసరాల్లో భక్తుల అవసరాలకనుగుణంగా కొందరు వ్యాపారులు వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి తోడు దశాబ్దం క్రితం ఆటవీశాఖ మెట్లు నిర్మించింది. తప్ప ఇతర సౌకర్యాలు ఏమీ లేవు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రేణుకాచౌదరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు.
వీరిరువురు కూడ గుబ్బలమంగమ్మ ఆలయ ప్రాంతాన్ని పెద్ద టూరిజం పాయింట్ గా అభివృద్ధిచేస్తామని ప్రకటించారు. అయితే అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకోవ డానికి వెళ్లాలంటే సరైన రవాణా సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆలయాన్ని టూ రిజం ప్రాంతంగా అభివృద్ధిచేయాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు.
సయ్యద్ హజరత్ అలి, అశ్వారావుపేట