19-10-2025 11:27:03 AM
హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర ప్రాంతీయ రవాణా సంస్థ(Regional Transport Authority) చెక్ పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ(Anti-Corruption Bureau) అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించింది. సిబ్బంది నుండి లెక్కల్లో చూపని రూ.1.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని పెందుర్తి, సలాబత్ పూర్ వద్ద చెక్ పోస్టుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. పెందుర్తిలో రూ.51 వేలు, ముగ్గురిని, సలాబత్ పూర్ లో రూ.36 వేలు, ఒకరిని అదుపులోకి తీసుకున్న సిబ్బంది. సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్ పల్లి చెక్ పోస్టులో ఏసీబీ డీఎస్పీ సురేందర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేశారు. చిరాగ్ పల్లి చెక్ పోస్టులో రూ.42 వేలు స్వాధీనం, ఎంవీఐ కిరణ్ ను అధికారులు విచారిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని రవాణాశాఖ చెక్ పోస్టుల్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, పాల్వంచ, ముత్తగూడెం చెక్ పోస్టులో ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఏసీబీ సోదాల్లో లెక్కల్లో చూపని నగదు పట్టుబడ్డింది. అర్థరాత్రి నుంచి చెక్ పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భోరాజ్ చెక్ పోస్ట్ నుండి రూ.1.26 లక్షలు, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్ పోస్ట్ నుండి రూ.5,100, నిర్మల్ జిల్లాలోని భైంసా మండలంలోని బెల్తారోడా చెక్ పోస్ట్ నుండి రూ.3,000 స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వాహనాల డ్రైవర్ల నుండి రవాణా శాఖ సిబ్బంది, ప్రైవేటుగా నియమించబడిన వ్యక్తుల సహాయంతో లంచాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లంచం ఎక్కువగా తీసుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ప్రభుత్వం గతంలో అటువంటి చెక్ పోస్టులను తొలగించాలని నిర్ణయించింది, అయినప్పటికీ అవి పనిచేస్తూనే ఉన్నాయి. ఏప్రిల్‌లో, వాంకిడి మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుపై ఎసిబి అధికారులు దాడి చేసి, సిబ్బంది నుండి లెక్కల్లో చూపని రూ.45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.