19-10-2025 10:21:24 AM
హనుమకొండ,(విజయక్రాంతి): మెడికోవర్ హాస్పిటల్స్, వరంగల్ వైద్య బృందం మరోసారి వైద్య రంగంలో విశేష విజయాన్ని సాధించింది. పర్వతగిరి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల మహిళ ప్రాణాలను రక్షిస్తూ అత్యంత క్లిష్టమైన కరోనరీ ఆర్టరీ అన్యూరిజం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ రోగికి 2023లో కరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ జరిగింది. అదనంగా, ఆమె రుమటాయిడ్ ఆర్థరైటిస్ (సంధివాతం) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో డా. సంతోష్ మొదాని, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కరోనరీ యాంజియోగ్రఫీ నిర్వహించారు.
ఈ పరీక్షలో స్టెంట్ ఉన్న ప్రాంతంలో ఆర్టరీ గోడ బలహీనపడి పొంగిపోవడం— అంటే కరోనరీ ఆర్టరీ అన్యూరిజం అనే అరుదైన పరిస్థితి గుర్తించారు. ఇది స్టెంటింగ్ తర్వాత చాలా అరుదుగా కనిపించే పరిస్థితి దాదాపు వెయ్యిలో ఒక కేసు మాత్రమే ఇలా జరుగుతుందని డా. సంతోష్ మొదాని తెలిపారు. “రోగికి ఉన్న రుమటాయిడ్ వ్యాధి కారణంగా రక్తనాళాలు బలహీనపడి పరిస్థితి మరింత క్లిష్టమైంది,” అని ఆయన చెప్పారు.రోగి ప్రాణాలను కాపాడటానికి తక్షణ శస్త్రచికిత్స అవసరమై, డా. రవికిరణ్, కన్సల్టెంట్ కార్డియోథోరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్, నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
అన్యూరిజం భాగాన్ని తొలగించి, రోగి స్వంత రక్తనాళాలతో కరోనరీ బైపాస్ గ్రాఫ్టింగ్ చేశారు. ఈ శస్త్రచికిత్సకు అత్యంత సాంకేతిక నైపుణ్యం అవసరం. ఇది వరంగల్ జిల్లాలో మొదటిసారి విజయవంతంగా జరిగిన కేసుగా నిలిచింది. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో డా.వసు ప్రకాశ్, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ తో పాటు సెంటర్ హెడ్ నమ్రత, మార్కెటింగ్ హెడ్ హరినాథ్ గుప్తా పాల్గొన్నారు.